Begin typing your search above and press return to search.

బీజేపీకి మరో మిత్రుడి షాక్

By:  Tupaki Desk   |   12 Nov 2019 12:30 PM GMT
బీజేపీకి మరో మిత్రుడి షాక్
X
ఒక్కొక్క అడుగు వేస్తూ పైకి ఎదిగే వేళలో వెంట వచ్చిన మిత్రుల్ని చాలామంది మర్చిపోరు. అదేం ఖర్మో కానీ విపక్షంలో ఉన్న వేళ అండగా ఉండి.. అధికారంలోనూ దన్నుగా నిలిచిన మిత్రపక్షాల విషయంలో బీజేపీ అధినాయకత్వం కాస్త తేడాగా వ్యవహరిస్తుందన్న ఆరోపణ ఉంది. ఒకప్పుడు మిత్రపక్షాల దన్ను లేక.. ఎవరూ దరి చేరని పార్టీగా పేరున్న బీజేపీకి.. మారిన కాలానికి తగ్గట్లు కొందరు మిత్రులు వచ్చి చేశారు.

కానీ.. అలా వచ్చిన మిత్రుల్ని నిలుపుకునే విషయంలో కమలనాథులు ఫెయిల్ అవుతున్నారన్న ఆరోపణ ఉంది. దీనికి ఊతమిస్తూ మహారాష్ట్రలో శివసేన ఎపిసోడ్ ఒకటి తెర మీదకు వస్తే.. తాజాగా మరో మిత్రుడు లోక్ జనశక్తి పార్టీ బీజేపీకి షాకిచ్చింది. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో తమ మిత్రపక్షమైన బీజేపీతో కాకుండా తాము ఒంటరిగా పోటీలోకి దిగుతామని స్పష్టం చేస్తోంది ఎల్ జీ పీ. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని.. రాష్ట్రంలోని 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొంది. ఈ రోజు సాయంత్రానికి మొత్తం అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు పేర్కొంది. జార్ఖండ్ రాష్ట్రంలో 81 స్థానాలు ఉండగా.. నవంబరు 30 నుంచి నవంబరు 20 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. బీజేపీ ఇప్పటికే 52 మంది అభ్యర్థులతో తన జాబితాను ప్రకటించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జంషెడ్ పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే.. జార్ఖండ్ లో ఎల్ జేపీ ప్రభావం పెద్దగా లేకున్నా.. ఆ పార్టీ 50 స్థానాల్లో పోటీ చేయటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షాలు గుర్రుగా లేకుండా చూసుకోవటంలో కమలనాథులు ఫెయిల్ అవుతున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. కేంద్రమంత్రి ఎల్ జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం పార్టీకి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి.. మిత్రులతో సరిగా ఉండని తీరు బీజేపీకి మంచిది కాదంటున్నారు. దీన్ని కమలనాథులు ఎప్పటికి అధిగమిస్తారో చూడాలి.