Begin typing your search above and press return to search.

#అవిశ్వాసం..నిమిషాల్లోనే స‌భ వాయిదా!

By:  Tupaki Desk   |   29 March 2018 9:56 AM GMT
#అవిశ్వాసం..నిమిషాల్లోనే స‌భ వాయిదా!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా - విభ‌జన హామీల‌పై కేంద్రం వైఖ‌రికి నిర‌స‌గా వైసీపీ - టీడీపీ ల‌తో పాటు వివిధ పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, స‌భంలో ఏఐడీఎంకే తో పాటు మ‌రి కొన్ని పార్టీలు గంద‌ర‌గోళం సృష్టించ‌డంతో లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హ‌జ‌న్ ప‌లుమార్లు వాయిదా వేసిన విష‌యం విదిత‌మే. ప‌లువురు ఎంపీలు వెల్ లోకి దూసుకువ‌చ్చి ఆందోళ‌న చేయ‌డంతో స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేస్తున్నారు. గ‌త 8 రోజులుగా లోక్ స‌భ లో అవిశ్వాసం చ‌ర్చ‌కు రాలేదు. తాజాగా - బుధ‌వారం నాడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. అయితే - గురు - శుక్ర‌ - శ‌ని - ఆది ....వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు రావ‌డంతో స‌భ సోమ‌వారానికి వాయిదా ప‌డింది. అయితే, స‌భ‌లో గంద‌ర‌గోళం లేకుండా - సజావుగా సాగితేనే అవిశ్వాసంపై చర్చ చేపడ‌తాన‌ని స్పీకర్ చెప్పారు.

ఈ నేప‌థ్యంలో, ఈ 8 రోజుల్లో లోక్ స‌భ‌ను సుమిత్ర మ‌హ‌జ‌న్ చాలా తొంద‌ర‌గా వాయిదా వేశారు. గత శుక్రవారం అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి నిన్న‌టి వ‌ర‌కు స‌భ వాయిదా ప‌డ‌డానికి ప‌ట్టిన స‌మ‌యాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. శుక్ర‌వారం నాడు ఒక్క నిమిషంలో - ఆ తర్వాత 19వ తేదీన‌ రెండు నిమిషాల్లో - 20న ఒక నిమిషంలో - 21న రెండు నిమిషాల్లో - 22న రెండు నిమిషాల్లో - 23న మూడు నిమిషాల్లో - 27న రెండు నిమిషాల్లో - 28న మూడు నిమిషాల్లో వాయిదాపడింది. ప్ర‌తిరోజూ.......అర‌గంట క‌న్నా తక్కువ స‌మ‌యంలోనే స‌భ వాయిదా ప‌డింది.

కాగా, మొద‌ట వైసీపీ పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. అది చూసి టీడీపీ...ఆ తర్వాత కాంగ్రెస్ - సీపీఎం - ఆర్ ఎస్పీలు నోటీసులు ఇచ్చాయి. కానీ, నేటివ‌ర‌కు అవిశ్వాసంపై చర్చ జరగలేదు. అయితే, అవిశ్వాసానికి బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్న నేప‌థ్యంలో సోమ‌వారం నాడు చ‌ర్చ‌జ‌రుగుతుందేమో వేచిచూడాలి.