Begin typing your search above and press return to search.

6 గంటలు.. 443 ఓట్లతో జీఎస్టీకి ఓకే

By:  Tupaki Desk   |   9 Aug 2016 6:11 AM GMT
6 గంటలు.. 443 ఓట్లతో జీఎస్టీకి ఓకే
X
దేశ వ్యాప్తంగా వస్తు.. సేవల పన్ను విషయానికి సంబంధించినకీలకమైన జీఎస్టీ బిల్లు చట్టంగా మారేందుకు వీలుగా మరో అడుగు ముందుకు పడింది. 16ఏళ్లుగా జీఎస్టీ బిల్లును చట్టంగా చేయాలన్నా ప్రక్రియకు.. సోమవారం లోక్ సభలో నిర్వహించిన సవరణల బిల్లు ఓటింగ్ తో ఒక పెద్ద అడుగు ముందుకు పడిందని చెప్పాలి. వాస్తవానికి జీఎస్టీ బిల్లు ఇప్పటికే ఒకసారి లోక్ సభలో ఆమోదం పొందింది. అయితే.. ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లిన తర్వాత అక్కడ కొన్ని సవరణలుచేపట్టారు. వీటికి లోక్ సభ ఆమోదం తప్పనిసరి. దీంతో.. ఈ బిల్లును మరోసారి లోక్ సభకు తీసుకొచ్చారు.

దాదాపు ఆరు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం.. ఈ సవరణల బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 443 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా ఒక్క ఓటు నమోదు కాలేదు. బిల్లును వ్యతిరేకిస్తూ.. తమిళనాడు అధికారపక్షం అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేసి.. ఓటింగ్ లో పాల్గొనలేదు. సవరణల బిల్లు ఆమోదం ముందు జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్.. అధికారపార్టీల మధ్య చురకలు పరస్పరం సంధించుకున్నారు.

జీఎస్టీ బిల్లు క్రెడిట్ తమదేనన్న విషయాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించగా.. బీజేపీ హుందాగా ఆ ప్రయత్నాన్ని తిప్పి కొట్టి కాంగ్రెస్ కు షాకిచ్చింది. జీఎస్టీ బిల్లు ఆమోదంతో పన్నుల తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తికల్పించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్లుగా వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలుతో.. వినియోదారుడేరాజు అన్న విషయం నిరూపింతం కావటమేకాదు.. భారతీయులంతా ఒక్కటే అన్న భావన కలగటం ఖాయమని చెప్పారు. ఇక.. జీఎస్టీ బిల్లుకుతామే ప్రాణం పోసినట్లుగా విపక్ష నేత.. కాంగ్రెస్ కు చెందిన మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మోడీ తనదైన శైలిలో చురకలు సంధించారు.

బిల్లు ఆమోదం పొందిన గొప్పతనం ఏ ఒక్క రాజకీయ పార్టీదో కాదని.. అత్యున్నత సంప్రదాయాలు కలిగిన భారత రాజకీయ వ్యవస్థదిగా అభివర్ణించిన మోడీ.. ‘‘జీఎస్టీకి తామే జన్మనిచ్చామని కాంగ్రెస్ చెబుతోంది. కావొచ్చు.. ఇప్పుడు బీజేపీ ఆ బిల్లు ఆలనాపాలనా చూసుకుంటోంది. అయినా.. విజయం ఎవరిది అన్న దానిపై చర్చించాలని మేం భావించటం లేదు. జీఎస్టీ పై ఏకాభిప్రాయం కోసం ఎంతో కృషి చేశాం. సోనియాగాంధీ.. మన్మోహన్ సింగ్ లతో పాటు అన్ని రాజకీయ పార్టీలు.. నేతలతో సంప్రదింపులు జరిపి అందిరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చాం. కేవలం అంకెల మెజార్టీతో కాకుండా పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకునేలా ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని భావించాం. అందుకే అన్ని పార్టీల సమ్మతితోనే జీఎస్టీని ప్రవేశ పెట్టాం’’ అని వ్యాఖ్యానించారు. ఏమైనా జీఎస్టీ బిల్లు ఏకగ్రీవం కావటం అందరి విజయమని చెప్పి అందరి మనసులు ప్రధాని మోడీ గెలుచుకుంటే.. గెలుపులో క్రెడిట్ కోసం పాకులాడిన కాంగ్రెస్ మాత్రం గెలిపించి మరీ ఓడిపోవటం గమనార్హం.

కొసమెరుపు: పార్లమెంటులో ప్రతి ఎంపీ సీటు ముందు ఒక ఓటింగ్ బటన్ ఉంటుంది. సరిగ్గా జీఎస్టీ కి ఓటు వేసే సమయంలోనే ఏకంగా ప్రధానమంత్రి ముందుండే బటన్ పనిచేయడం మానేసింది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగింది.