Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ వేళ కొత్త పద్దతి.. ఉదయం లోక్ సభ.. సాయంత్రం రాజ్యసభ

By:  Tupaki Desk   |   25 Jan 2022 5:03 AM GMT
ఒమిక్రాన్ వేళ కొత్త పద్దతి.. ఉదయం లోక్ సభ.. సాయంత్రం రాజ్యసభ
X
మహమ్మార మూడో వేవ్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. దేశంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న సమయంలో బడ్జెట్ సమావేశాల్ని నిర్వహించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నెల చివరన నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు జరుగుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరగటం.. కరోనా పాజిటివ్ రేట్ అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళలో.. పార్లమెంటు సమావేశాన్ని రోటీన్ కు భిన్నంగా నిర్వహించాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని చెబుతున్నారు.

జనవరి 31న మొదలయ్యే సమావేశాల్నిరెండు భాగాలుగా చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రాజ్యసభను నిర్వహించి.. సాయంత్రం నాలుగు గంటల నుంచి 9 గంటల వరకు లోక్ సభను నిర్వహించాలనుకుంటున్నారు. ఈ మేరకు లోక్ సభ బులిటెన్ విడుదల చేసింది. జనవరి 31న షెడ్యూల్ ఈ తీరులో ఉంటే.. ఫిబ్రవరి 1 నుంచి మాత్రం లోక్ సభ ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఫిబ్రవరి 2 నుంచి మాత్రం అందుకు భిన్నంగా సమయాల్ని మారుస్తున్నారు.

ఇప్పటివరకు నిర్ణయించిన దాని ప్రకారం ఫిబ్రవరి 2 నుంచి 11వ తేదీ వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభను నిర్వహిస్తారు. ఈ సమావేశాలకు సంబంధించి మొదటి రోజు మాత్రం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభ్యులంతా భౌతిక దూరం పాటించేలా సీట్ల ఏర్పాటును చేయనున్నారు. కరోనా కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.