Begin typing your search above and press return to search.

ఎంపీలు తెగ సెలవులు పెడుతున్నారట

By:  Tupaki Desk   |   29 Aug 2016 6:37 AM GMT
ఎంపీలు తెగ సెలవులు పెడుతున్నారట
X
లోక్ సభలో కొద్దిమంది ఎంపీలు మాత్రమే హాజరు విషయంలో మెరుగ్గా ఉంటారు. చాలామంది డుమ్మా బాపతే. 16వ లోక్ సభలో సగటు హాజరు 82 శాతం మాత్రమే. ఎక్కువ రోజులు సభకు గైర్హాజరయ్యే సందర్భాల్లో కొందరు మాత్రమే సెలవు చీటీలు సమర్పిస్తున్నారు. 16వ లోక్ సభలో గడచిన రెండేళ్లలో మొత్తం 37 సెలవు అప్లికేషన్లు వచ్చాయి. 30 మంది సభ్యులు వీటిని ఇచ్చారు. మొత్తం 1149 రోజుల కాలానికి ఈ సెలవు అప్లికేషన్లు వచ్చాయి.

37 సెలవు చీటీల్లో 14 బీజేపీ ఎంపీలు ఇచ్చినవి కాగా 8 తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సమర్పించినవి. కాంగ్రెస్ ఎంపీల నుంచి 4 సెలవు చీటీలు వచ్చాయి. బీజేడీ నుంచి 3.. వైసీపీ - ఎన్సీపీ - పీడీపీ నుంచి రెండేసి.. జేఎంఎం - పీఎంకేల నుంచి ఒక్కొక్క అప్లికేషన్ వచ్చాయి. తక్కువ తక్కువ రోజులకు సెలవు పత్రం ఇచ్చే అలవాటు ఎంపీలకు లేకపోవడంతో చాలా పార్టీల నేతల నుంచిఇలాంటి అప్లికేషన్లు లేవు.

కారణాలివీ..

అనారోగ్య కారణాలను చూపి 21 మంది సెలవు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఎన్నికల కారణంతో 8 - జ్యూడీషియల్ కస్టడీ కారణంగా 3 - నియోజకవర్గ పనుల పేరిట 2 - విదేశీ యానానికి 2 - కుటుంబ సభ్యుల మరణం కారణంగా ఒకరు సెలవు పెట్టారు. కాగా వీటిలో మూడు అప్లికేషన్ల విషయంలో మాత్రం పార్లమెంటు కమిటీ వారు కోరినన్ని రోజులు సెలవు ఇచ్చేందుకు అంగీకరించలేదు.

కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ సుదీర్ఘ కాలం సెలవు కోరగా 59 రోజులకే ఆమోదం దొరికింది. వైసీపీ ఎమ్మెల్యే ఎస్పీవై రెడ్డికీ అదే అనుభవం ఎదురైంది. బీజేపీ ఎంపీ రామచంద్ర హంస్తా కూడా ఎక్కువ రోజులు కోరగా 69 రోజులకే అనుమతి లభించింది. ఆయన చిట్ ఫండ్ కుంభకోణంలో చిక్కుకుని జ్యూడిషియల్ కస్టడీలో ఉండడంతో ఏకంగా 171 రోజులు సెలవు కోరారు. ఎస్పీవై రెడ్డి 89 రోజులు సెలవడిగారు. మరో అయిదుగురు ఎంపీలు 50 రోజుల కంటే ఎక్కువ కాలం సెలవు కోరారు.పార్లమెంటు నియమాల ప్రకారం 60 రోజుల కంటే ఎక్కువ అనుమతి లేకుండా గైర్హాజరైతే సభ్యత్వం రద్దవుతుంది.