Begin typing your search above and press return to search.

ఆ ప‌దాల‌ను నిషేధించ‌లేదంటున్న లోక్ స‌భ స్పీక‌ర్!

By:  Tupaki Desk   |   15 July 2022 4:32 AM GMT
ఆ ప‌దాల‌ను నిషేధించ‌లేదంటున్న లోక్ స‌భ స్పీక‌ర్!
X
భార‌త పార్లమెంట్‌లో ఏ పదాన్నీ ఉపయోగించకుండా నిషేధమేదీ విధించలేదని లోక్ స‌భ స్పీక‌ర్ ఓం ప్ర‌కాష్ బిర్లా స్ప‌ష్టం చేశారు. ఎంపీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛ‌గా వెల్ల‌డించ‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. 'సిగ్గుచేటు', 'జుమ్లాజీవి', 'దుర్వినియోగం', 'ద్రోహం', 'అవినీతి', 'నాటకం', కోవిడ్‌ స్ప్రెడర్‌, స్నూప్‌గేట్‌ తదితర పదాలు అన్‌పార్లమెంటరీగా పేర్కొంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌ బుక్‌ను విడుదల చేయ‌డం వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌తిప‌క్ష నేత‌లు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దీంతో స్పీక‌ర్ ఓం ప్ర‌కాష్ బిర్లా మీడియాతో మాట్లాడుతూ తాము ఏ ప‌దాల‌ను నిషేధించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

పార్లమెంట్‌లో మాట్లాడేందుకు వాడే పదాల్లో తాము ఏ పదాన్ని వాడ‌కుండా నిషేధించలేదని స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. కొన్ని పదాలను మాత్రమే తొలగించామని.. తొలగించిన పదాల సంకలనం మాత్రమే జారీ చేశామని చెప్పారు. కాబ‌ట్టి లోక్ స‌భ ఎంపీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛ‌గా వెల్లడించవచ్చని ఆయ‌న చెబుతున్నారు. ఎంపీలు తమ అభిప్రాయాలను వ్య‌క్తీక‌రించే హ‌క్కును ఎవరూ లాక్కోలేదని అంటున్నారు.

పార్లమెంటరీ పద్ధతులపై ఏ మాత్రం అవగాహన లేని కొంత‌మంది వ్యక్తులు విమర్శలు గుప్పిస్తున్నార‌ని స్పీక‌ర్ ఓం ప్ర‌కాష్ బిర్లా మండిప‌డ్డారు. తొలగింపు కోసం ఎంచుకున్న పదాలను అధికార పార్టీతోపాటు విప‌క్ష స‌భ్యులు కూడా ఉపయోగిస్తున్నారని తెలిపారు.

ప్రతిపక్షాలు మాత్రమే ఉపయోగించే పదాలను సెలెక్టివ్‌గా తొలగించలేదని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించొద్ద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఆయ‌న విన్న‌వించారు.

కాగా లోక్‌సభ సెక్రటేరియట్‌ విడుదల చేసిన బుక్‌లెట్‌పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రెయిన్‌తోపాటు పలువురు విమర్శలు గుప్పించారు. ప్రధాని న‌రేంద్ర మోదీ పాల‌న‌ను స‌రైన రీతిలో ఎండ‌గ‌డుతూ చేసే వ్యాఖ్యలు ఇప్పుడు అన్ పార్లమెంటరీ ప‌దాలుగా మారాయంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తాను ఆ పదాలను ఉప‌యోగిస్తాన‌ని.. దమ్ముంటే స్పీకర్‌ తనను సస్పెండ్‌ చేయాలని ఒబ్రెయిన్ సవాల్‌ విసిరారు.