Begin typing your search above and press return to search.

రఘురామకు షోకాజ్ నోటీసు

By:  Tupaki Desk   |   16 July 2021 6:00 AM GMT
రఘురామకు షోకాజ్ నోటీసు
X
అనర్హత వేటు విషయంలో వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం షోకాజ్ నోటీసు జారీచేసింది. పార్టీ ఫిర్యాదు ప్రకారం ఎందుకు అనర్హత వేటు వేయకూడడో సమాధానం చెప్పాలంటు ఎంపికిచ్చిన నోటీసులో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నాయకత్వం ఏడాదికి పైగా స్పీకర్ ను కలుస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నిసార్లు స్పీకర్ ను కలిసినా ఉపయోగం కనబడకపోవటంతో బాగా ఒత్తిడి పెంచేస్తోంది. ఒకవైపు అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపిలు, మరోవైపు వద్దని రఘురామ స్పీకర్ పై బాగా ఒత్తిడి పెంచుతున్నారు. ఈనెల 19 వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఇదే విషయమై సభను స్తంభింపచేస్తామంటు ఎంపిలు స్పీకర్ ను విజ్ఞప్తితో కూడిన హెచ్చరికలు జారిచేసిన విషయం అందరికీ తెలిసిందే.

వైసీపీ ఎంపిల సమావేశం తర్వాత ఏమనుకున్నారో ఏమో ఎంపికి నోటీసు జారీచేశారు. తమ నీటీసుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటు స్పష్టంగా ఆదేశించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం క్రింద ఎంపికి స్పీకర్ కార్యాలయం నోటీసిచ్చింది. తమ పార్టీ తరపున గెలిచిన రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే చాలాసార్లు స్పీకర్ ను కలిసి అనర్హత వేటు వేయాలంటు విజ్ఞప్తి చేశారు.

వైసీపీ తరపున గెలిచిన రఘురామకు కొద్దిరోజులకే జగన్మోహన్ రెడ్డితో గ్యాప్ వచ్చింది. దాంతో ముందు పార్టీకి తర్వాత ప్రభుత్వానికి దూరమయ్యారు. తర్వాత ప్రభుత్వంపైన, ఆ తర్వాత జగన్ పైన వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. చివరకు అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో కేసు కూడా వేశారు. జగన్ను జైలుకు పంపనిదే ఏపిలోకి అడుగుపెట్టనంటు పెద్ద శపథం కూడా చేశారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల క్రిందకే వస్తాయని వైసీపీ సాక్ష్యాలతో సహా స్పీకర్ కు ఫిర్యాదులు చేసింది.

తిరుగుబాటు ఎంపికి స్పీకర్ కార్యాలయం నోటీసివ్వటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదే విధమైన ఆరోపణలతో పశ్చిమబెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శిశిర్ అధికారి, సునీల్ కుమార్ మండల్ కు కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులిచ్చింది. తమ పార్టీ తరపున గెలిచి తర్వాత బీజేపీలోకి ఫిరాయించిన ఇద్దరిపై వేటు వేయాలని ఎప్పటినుండో స్పీకర్ ను తృణమూల్ డిమాండ్ చేస్తోంది. మొత్తంమీద ముగ్గురు ఎంపిల మీద అనర్హత వేటు వివాదం తొందరలోనే తేలిపోతుంది.