Begin typing your search above and press return to search.

లోకేశ్ ఎన్నికల్లో గెలవలేడా?

By:  Tupaki Desk   |   2 March 2017 7:35 AM GMT
లోకేశ్ ఎన్నికల్లో గెలవలేడా?
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడి తనయుడు - నీడ నేత లోకేశ్ ను ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా పంపుతుండడంపై రాజకీయ పార్టీలు - నేతలు ఫక్కున నవ్వుతున్నారు. దేశంలో ఏ ప్రముఖ నేత కూడా తమ కుమారుల రాజకీయ ఎంట్రీ విషయంలో ఇంతగా భయపడలేదని అంటున్నారు. నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ప్రజల్లోకి వచ్చారని.. మాధవరావ్ సింథియా - రాజేష్ పైలట్.. ములాయం సింగ్ యాదవ్ - లాలూ ప్రసాద్ యాదవ్.. వైఎస్ రాజశేఖరరెడ్డి - కోట్ల విజయభాస్కరరెడ్డి - దేవెగౌడ - కరుణానిధి... ఇలా ఎందరో జాతీయ స్థాయి నేతలు తమ కుమారుల రాజకీయ ఎంట్రీకి ప్రత్యక్ష ఎన్నికలనే వేదిక చేసుకున్నారని అంటున్నారు. కొందరు నేతల కుమారులు ఎన్నికల్లో గెలిచి ఆ తరువాత రాష్ట్రాల్లో - కేంద్రంలో మంత్రులుగా - సీఎంలుగా ఉన్నారని.. కొందరు ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వారు ప్రజాతీర్పు ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం తన కుమారుడు ఎన్నికల్లో నిలబడితే గెలుస్తాడో లేదోనన్న భయంతో ఎమ్మెల్సీగా పంపిస్తున్నారని విమర్శిస్తున్నారు.

తాజగా లోక్ సత్తా పార్టీ కూడా ఇదే విషయంలో చంద్రబాబును - లోకేశ్ ను ఏకిపడేసింది. లోకేష్‌ ను ఎమ్మెల్సీగా చేసి వెంటనే మంత్రిని చేసేందుకు చంద్రబాబు కదుపుతున్న పావులపై లోక్‌ సత్తా మండిపడింది. చంద్రబాబుకు తన కుమారుడి సామర్థ్యంపై నమ్మకం ఉంటే అసెంబ్లీ నుంచి పోటీ చేయించి గెలిపించుకోవాలని లోక్‌సత్తా రాష్ట్ర కమిటీ సూచించింది. కనీసం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీకి దింపలేదని... అందుకు కూడా భయపడ్డారని.. నిస్సిగ్గుగా ఎమ్మెల్యేల కోటాలో లోకేష్‌ ను ఎంపిక చేయడం బట్టే చంద్రబాబు భయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని అభిప్రాయపడింది.

మరోవైపు కుటుంబ రాజకీయాలపైనా లోక్ సత్తా మండిపడింది. గతంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలుంటే కుటుంబపాలన అంటూ మండిపడ్డ చంద్రబాబు… ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయిందని… కాబట్టి లంచాల భయం లేకుండా సేవలు అందేలా పౌర సేవల హక్కుల చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని లోక్‌ సత్తా డిమాండ్ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/