Begin typing your search above and press return to search.

లోకేష్‌..ఎంత చెప్పినా అది ఓట‌మే సుమీ!

By:  Tupaki Desk   |   10 Feb 2016 1:52 PM GMT
లోకేష్‌..ఎంత చెప్పినా అది ఓట‌మే సుమీ!
X
తెలంగాణలో అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల పోరులో అధికార టీఆర్ ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించ‌గా... ప్ర‌తిప‌క్షాలైన టీడీపీ - కాంగ్రెస్ - బీజేపీ నామ‌మాత్రపు పనితీరును ప్ర‌ద‌ర్శించాయి. ఏకంగా సింగిల్ డిజిట్‌ కు అది కూడా 1,2,4 స్థానాల‌కు ఆయా పార్టీలు ప‌రిమిత‌మైపోయాయి. టీఆర్ ఎస్ గెలుపు ఎంత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించిందో...ఈ మూడు పార్టీలో ఘోర ప‌రాజ‌యం కూడా అంతే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఈ ప‌రాజ‌యంపై ఆయా పార్టీలు తమదైన విశ్లేష‌ణ చేస్తున్నాయి. కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొత్త‌గా విశ్లేష‌ణ చేశారు.

గ్రేట‌ర్ ఫ‌లితాలు వ‌చ్చిన అనంత‌రం మీడియాతో నేరుగా ముఖాముఖి అయిన లోకేష్ ఆయా ప్రతినిధులతో చిట్‌ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రేట‌ర్ ఫ‌లితాల‌ను విశ్లేషిస్తూ 2009 జీహెచ్‌ ఎంసీ ఎన్నికల కంటే ప్ర‌స్తుత‌ ఎన్నికల్లో టీడీపీకి లక్షన్నర ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. పార్టీ పటిష్టత కోసమే గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీచేశామ‌ని పేర్కొంటూ గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా ప్ర‌జా సంక్షేమం కోసం పాటుప‌డ‌తామ‌ని చెప్పారు. గ్రేట‌ర్ హైదరాబాద్‌ లో ఎలాగైనా గెల‌వాల‌నే ఉద్దేశంతో టీఆర్‌ ఎస్ అడ్డ‌గోలుగా హామీ ఇచ్చింద‌ని లోకేష్ అభ్యంత‌రం తెలిపారు. అధికార పార్టీ హామీల‌ విలువ రూ.40 వేల కోట్లు అని లెక్క‌క‌ట్టిన‌ లోకేష్ హామీలు అమలుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

పాత‌బ‌స్తీ మిన‌హా మిగ‌తా చోట్ల టీడీపీ-బీజేపీ కూట‌మి ఓట్లు మెరుగుప‌డ్డాయ‌ని లోకేష్ వివ‌రించారు. అధికార‌ పార్టీ సీమాంధ్రుల‌ను భ‌య‌పెట్టింద‌ని లోకేష్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. త‌మ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు ఉప‌యోగించుకోవ‌డం వైసీపీ వ‌క్ర‌బుద్ధికి నిద‌ర్శ‌నమ‌ని లోకేష్ ఆక్షేపించారు. అయితే ఓట్లు పెర‌గ‌డం సంతోష‌క‌ర‌మే కావ‌చ్చు కానీ ఓట‌మి మాత్రం ఓట‌మేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.