Begin typing your search above and press return to search.

12 కేసులుంటే లోకేష్ అపాయింట్మెంట్ !!

By:  Tupaki Desk   |   31 March 2022 12:30 AM GMT
12 కేసులుంటే లోకేష్ అపాయింట్మెంట్ !!
X
పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నాయి. తనపైన 11 కేసులున్నాయి కాబట్టి 12కు పైగా కేసులున్న కార్యకర్తలతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత తాను మాట్లాడుతానని చెప్పారు. పైగా 11 కేసుల కన్నా తక్కువున్న కార్యకర్తలు ఎవరూ తన దగ్గరకు రావద్దని లోకేష్ స్పష్టంగా వార్నింగు ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత తన దగ్గరకు వచ్చేవారిని ముందు కేసుల గురించే ఆరా తీస్తానన్నారు. కార్యకర్తలపై 12 కేసులకన్నా తక్కువుంటే వాళ్ళు పార్టీ తరపున పోరాటాలు చేయలేదని అర్ధమన్నారు. 11 కేసులకన్నా తక్కువున్న వాళ్ళెవరు తన దగ్గరకు రావద్దని లోకేష్ స్పష్టంగా చెప్పేశారు. తనపైన 11 కేసులున్నాయి కాబట్టి అందరిపైనా 12 కేసులకు తక్కువ కాకుండా నమోదై ఉండాలని లోకేష్ కోరుకోవటమే చాలా విచిత్రంగా ఉంది.

లోకేష్ మీద 11 కేసులు కాదు మరో 20 కేసులు నమోదైనా తనకొచ్చే నష్టం ఏమీలేదు. కానీ కార్యకర్తలపైన కేసులు నమోదై జైలుకు వెళితే వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్ధితి ఏమిటి ? అనే విషయాన్ని లోకేష్ ఆలోచించినట్లు లేదు.

ఏ కార్యకర్త కూడా తనపైన కేసులు నమోదు కావాలని పోలీసుస్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాలని అనుకోరు. పార్టీ కోసం కష్టపడటానికి సిద్దంగా ఉంటారు కానీ కేసులు నమోదు చేయించుకోండంటే ఎవరు అంగీకరించరు.

ఇంత చిన్న విషయాన్ని లోకేష్ ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్ల పార్టీకి నష్టమే జరుగుతుంది కానీ ఎలాంటి లాభం ఉండదు. పార్టీ కోసం పని చేసేటప్పుడు ఎవరిమీదైనా కేసులు పడితే వాళ్ళని పార్టీ ఆదుకుంటుందని, కేసులకు భయపడవద్దని లోకేష్ చెబితే కార్యకర్తలు ధైర్యంగా పార్టీకి పనిచేస్తారు. అంతేకానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 12 కేసులున్న వారిని తప్ప తాను గుర్తించనని, కేసులు లేనివారు అసలు తన దగ్గరకే రావద్దని చెప్పటమే చాలా విచిత్రంగా ఉంది.

అయితే, కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి కేసులకు భయపడకుండా ఉండటానికి రివర్స్ స్ట్రాటజీలో భాగంగా లోకేష్ ఇలా మాట్లాడాడు అని పార్టీ నేతలు అంటున్నారు. లోకేష్ అంతరార్థం ఒకటైతే వైసీపీ వాళ్లు ఇంకోటి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.