Begin typing your search above and press return to search.

చినబాబు సీఎం... పెదబాబు సెంట్రల్ మినిస్టర్... ?

By:  Tupaki Desk   |   29 Aug 2021 3:57 AM GMT
చినబాబు సీఎం... పెదబాబు సెంట్రల్ మినిస్టర్... ?
X
ఇదేదో బాగానే ఉన్నట్లుంది. తెలుగుదేశం రాజకీయాలలో తండ్రీ కొడుకులే ముందుగా సర్దుకుంటున్నారులా ఉంది. లోకేష్ వయసు వచ్చే ఎన్నికల నాటికి 41 దాటుతుంది. 2024 ఎన్నికలలో టీడీపీ కనుక గెలిస్తే యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు లోకేష్ ఉబలాటపడుతున్నారు. తాను సీఎం కావడం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు. ఇప్పటికే మంత్రిగా చేసిన లోకేష్ ఇక తన తరువాత అడుగు అక్కడే అంటున్నారు. అందుకోసమే అటు పార్టీలో యంగ్ టీమ్ ని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. తన తండ్రి చంద్రబాబు తన పదవికి ఎట్టి పరిస్థితులలో పోటీకి రారని ఆయన సీనియారిటీకి తగిన పదవి కూడా వేరే ఉందని లోకేష్ భావిస్తున్నారుట.

అంటే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల నాటికి 75 ఏళ్ళ వయసు వస్తుంది. అందువల్ల ఆయన జాతీయ రాజకీయాల్లో ఉండడమే బెటర్ అని చినబాబు గ్యాంగ్ మాటగా ఉంది. పైగా చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు కూడా. దాంతో ఢిల్లీలోనే ఆయన పాలిటిక్స్ చేయడం సబబు అంటున్నారుట. ఇక చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి గట్టి కృషి చేస్తారు. అదే విధంగా ఎక్కువ మంది ఎంపీలను కూడా టీడీపీ తరఫున కూడగట్టుకుని కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెడతారు అంటున్నారు.

కేంద్రంలో మోడీ ప్రభ మసకబారిపోవడంతో విపక్ష కూటమి అధికారంలోకి వస్తే దానికి టీడీపీ మద్దతు ఇస్తుంది. లేకపోతే బీజేపీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఆ విధంగా చంద్రబాబు తొలిసారిగా కేంద్ర రాజకీయాలలోకి వెళ్తారు అంటున్నారు. ఆయన తన సీనియారిటీకి తగిన విధంగా ఏ హోం శాఖనో, రక్షణ శాఖనో తీసుకుంటారు అని కూడా చెబుతున్నారు. అంటే లోకేష్ ఇక్కడ ముఖ్యమంత్రి, కేంద్రంలో మంత్రిగా చంద్రబాబు చక్రం తిప్పుతారు అన్న మాట.

నిజానికి ఇలాగే జరగాలని 2019 ఎన్నికల వేళ టీడీపీ కోరుకుంది. కానీ సీన్ సితార్ అయింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితులలో మాత్రం జరిగి తీరుతుంది అంటున్నారు. ఏపీలో జగన్ కి తీవ్రమైన వ్యతిరేకత ఉందని తాము ఈసారి అత్యధిక సీట్లు ఎమ్మెల్యే, ఎంపీల్ స్థానాలో సాధించి ఏపీతో పాటు ఢిలీలో కూడా హవా చాటుతామని టీడీపీ పెద్దలు అంటున్నారు. మొత్తానికి చినబాబు సీఎం, పెదబాబు సెంట్రల్ మినిస్టర్. ఇదేదో బాగానే ఉంది. ఊహాల్లో తమ్ముళ్ళు తేలిపోవడానికి ఇది బహు చక్కగా పనికివస్తుంది అంటున్నారు. ఇంతకీ ఊహలు, ఆశలు పక్కన పెడితే ఆచరణ ఉందా అన్నదే డౌట్ మరి.