Begin typing your search above and press return to search.

లోకేష్‌ను ఇలా చూడ‌టం న‌మ్మ‌లేకున్నాం

By:  Tupaki Desk   |   13 Jun 2016 4:01 PM GMT
లోకేష్‌ను ఇలా చూడ‌టం న‌మ్మ‌లేకున్నాం
X
తెలుగుదేశం పార్టీ యువ‌నేత‌ - ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు తాజా సంఘ‌ట‌న‌ నిద‌ర్శ‌నంగా నిలుస్తున్న‌దని అంటున్నారు. లోకేష్ వ్య‌క్తిత్వం గురించి ఒక‌మెట్టు ఎదిగేలా చేసే సంఘ‌ట‌న. ఇంత‌కీ విష‌యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సుదీర్ఘ‌కాలం త‌ర్వాత హైద‌రాబాద్‌ కు వ‌చ్చి తెలంగాణ టీడీపీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌తో తెలంగాణ‌లో ప‌రిస్థితి గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి విశ్లేషించి నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ తీరు చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఈ స‌మావేశం జ‌రుగుతున్న స‌మ‌యంలో హైద‌రాబాద్‌ లోనే ఉన్న నారా లోకేష్ సైతం ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. కాస్త ఆల‌స్యంగా వ‌చ్చిన నారా లోకేష్ ఈ క్ర‌మంలో మీటింగ్ గ‌దిలోకి చేరుకోగా అక్క‌డ ఉన్న సీట్లు నిండిపోయాయి. ఇది గ‌మ‌నించిన ప‌లువురు నేత‌లు ఆయ‌న‌కు త‌మ సీటును ఆఫ‌ర్ చేశారు. అయితే సున్నితంగా తిర‌స్క‌రించిన నారా లోకేష్ వెన‌కాల లైన్‌ లో ఉన్న ఓ సీట్లో కూర్చున్నారు. స‌మావేశం ఆసాంతం ఇటు నేత‌లు చెప్పే అభిప్రాయాలు విన‌డ‌మే కాకుండా అంటు త‌న తండ్రి- పార్టీ అధినేత చంద్ర‌బాబు చెప్పేది శ్ర‌ద్ధ‌గా విన్నారు. దీన్ని చూసి స‌మావేశానికి ప‌లువురు నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎదిగిన కొద్ది ఒదిగిఉండ‌టం, అంద‌ర్నీ గౌర‌వించ‌డం అనే చంద్ర‌బాబు ఆలోచ‌న తీరును లోకేష్ పుణికిపుచ్చుకున్నార‌ని చర్చించుకున్నారు. లోకేష్‌ను ఈ విధంగా చూడ‌టం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

కొస‌మెరుపుః ఇదిలాఉండ‌గా ఈ కార్య‌క్ర‌మానికి లోకేష్ గులాబీ చొక్క‌తో హాజ‌రుకావ‌డం విశేషం.