Begin typing your search above and press return to search.

మండ‌లి ర‌ద్దు..సాక్షి పై లోకేష్ 75 కోట్ల ప‌రువు న‌ష్టం

By:  Tupaki Desk   |   25 Jan 2020 9:06 AM GMT
మండ‌లి ర‌ద్దు..సాక్షి పై లోకేష్ 75 కోట్ల ప‌రువు న‌ష్టం
X
ఓ వైపు శాస‌న‌మండ‌లి ర‌ద్దు విష‌యంలో...ఏపీ మొత్తం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తుండ‌గా...మ‌రో వైపు తెలుగుదేశం పార్టీ యువ‌నేత నారా లోకేష్ ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. సాక్షి ప‌త్రిక‌ పై ప‌రువు న‌ష్టం దావా వేశారు.2019 అక్టోబ‌ర్ 22న 'చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి' శీర్షిక‌తో సాక్షి దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురితం అయిన క‌థ‌నంపై లోకేష్ దావా వేశారు. ప్ర‌ముఖుడినైన త‌న‌ ప‌రువుకు న‌ష్టం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించార‌ని లోకేష్ ఆరోపించారు.

చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి`` శీర్షిక‌తో వ‌చ్చిన క‌థ‌నంపై మండిప‌డుతూ, సాక్షి సంపాద‌క బృందానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు. ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు మంట‌క‌లిపేందుకు త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌క‌థ‌నం రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌ మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని అందులో పేర్కొన్నారు. దానికి 2019 న‌వంబ‌ర్ 10న సాక్షి స్పందిస్తూ నారా లోకేష్‌ కు వివ‌ర‌ణ ఇచ్చింది. అయితే, దీనిపై సంతృప్తి చెంద‌ని నారా లోకేష్‌ ప‌రువున‌ష్టం దావా వేశారు.

సాక్షి క‌థ‌నం రాసిన తేదీల్లో తాను విశాఖ‌లో లేనే లేనని లోకేష్ స్ప‌ష్టం చేశారు. ఇత‌ర ప్రాంతాల‌లో ఉన్నప్ప‌టికీ దురుద్దేశంతో త‌న ప‌రువుకు భంగం క‌లిగించిన ఘ‌ట‌న‌కు బాధ్యులున జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త మ‌రియు సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నం కు చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌ రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌ల పై రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు. కాగా, లోకేష్ ప‌రువు న‌ష్టం విష‌యం సంచ‌ల‌నంగా మారింది.