Begin typing your search above and press return to search.

తండ్రిని వదిలేసి జగన్‌ ను ఫాలో అవుతున్న లోకేశ్!

By:  Tupaki Desk   |   30 Oct 2019 5:36 AM GMT
తండ్రిని వదిలేసి జగన్‌ ను ఫాలో అవుతున్న లోకేశ్!
X
రాజకీయాల్లో ఒక్కో నాయకుడిది ఒక్కో తీరు. ఒకరు జనంతో అంటీముట్టకుండానే గొప్ప నాయకులుగా ఎదిగితే మరికొందరు జనంలో తిరుగుతూ, వారిలో ఒకరిగా మెలగుతూ నాయకులుగా నిలుస్తారు. ఏపీ సీఎం జగన్మోహనరెడ్డిది ఇదే పద్ధతి. ఆయన పాదయాత్ర పేరిట సుదీర్ఘ కాలం ప్రజల్లో తిరిగినా.. ఇప్పటికీ ఏదైనా సభో సమావేశమో పెట్టినా అక్కడకు వచ్చే జనంలో పేదలు, వృద్ధులు, రోగులు అన్న తేడా లేకుండా వారికి అక్కున చేర్చుకుంటారు. పిల్లలను ముద్దాడి వారితో మాట్లాడుతారు.. ఆడబిడ్డలు, వృద్ధులను తలనిమిరి వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు.. మట్టిచేతులతో తన వద్దకు వచ్చే రైతులను గుండెకు హత్తుకుని నేనున్నానన్న భరోసా ఇస్తారు. అందుకే జగన్ అంటే జనంలో అంతటి అభిమానం.

మరోవైపు చంద్రబాబు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా ప్రజలను ఇంత దగ్గరగా రానివ్వడం ఎప్పుడూ ఉండదు. తాను కూడా వృద్ధులు, మహిళలు, పిల్లలు, రైతులు, సమాజంలోని అనేక వర్గాలతో ఇంటరాక్ట్ అవుతారు కానీ జగన్ తరహాలో ఉండదు ఆయన తీరు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా నిన్నమొన్నటివరకు తండ్రిలానే ఉండేవారు. కానీ.. తాజాగా ఆయన రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది.

లోకేశ్ తన తండ్రి చంద్రబాబును కాకుండా తమ ప్రత్యర్థి వైఎస్ జగన్‌ను ఫాలో అవడం ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు చరిత్రలో కానీ, లోకేశ్ చరిత్రలో కానీ ఎన్నడూ లేనట్లుగా తొలిసారి లోకేశ్ ఓ కార్యక్రమంలో చిన్నారిని ఎత్తుకుని ఆ పాప బుగ్గన ముద్దాడడం కనిపించింది. ఇది లోకేశ్ రాజకీయ వ్యవహారంలో మారుతున్న ఆలోచనలకు అద్దం పడుతోంది. సామాన్యులను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం వంటి చంద్రబాబు కుటుంబానికి చెందిన నేతలెవరూ సాధారణంగా చేయరు. అది జగన్ ట్రేడ్ మార్క్. కానీ.. రాజకీయాల్లో సామాన్యుడికి చేరువ కావాలంటే పథకాలు, ఉచితాలు, వరాలతో పాటు ఇలాంటి ఆత్మీయతా అవసరమని లోకేశ్ గుర్తించినట్లుగా ఉంది.. అందుకే జగన్‌ను ఫాలో అవడం ఆయన ప్రారంభించారు.