Begin typing your search above and press return to search.

లోకేష్ ఫోన్ కాల్: 225 మందికి ఇల్లు

By:  Tupaki Desk   |   23 Sep 2015 9:46 AM GMT
లోకేష్ ఫోన్ కాల్: 225 మందికి ఇల్లు
X
వారంతా నిరుపేదలు... సమాజంలో అణగారినవర్గాలు... డబ్బు, పలుకుబడి ఏమీలేని వారు... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారంతా ఖాళీగా ఉన్న ప్రభుత్వం స్థలంలో గుడిసెలు, గుడారాలు వేసుకుని కూలీనాలి చేసుకుని బతుకీడుస్తున్నారు. ఏళ్ల తరబడి అక్కడే ఉంటుండడంతో ఆశకొద్దీ తాము ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వమంటూ గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అయితే... వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఏ నాయకుడు, అధికారీ వారి బాధ వినలేదు... పైగా అదంతా ప్రభుత్వ స్థలమని.. వారు పట్టాలు అడుగుతున్నారని తెలిసిన రౌడీలు, గూండాలు, కబ్జాకోరు నాయకులు వారుంటున్న స్థలంపై కన్నేశారు. వారిని ఖాళీ చేయించి ఆ స్థలం కొట్టేయాలని ప్లాన్ చేశారు. నిత్యం వారిని బెదిరించేవారు.. ఖాళీ చేయమని ఒత్తిడి చేసేవారు. కాంగ్రెస్ హయాంలో అయితే వీరు ఉంటున్న గుడిసెలకు గూండాలు ఏకంగా నిప్పు పెట్టారు. ఇదంతా కర్నూలు జిల్లా కొల్లూరులోని జ్యోతిరావు పూలే నగర్ నిరుపేదల కష్టం.... ఈలోగా ప్రభుత్వం మారింది.. చంద్రబాబు ముఖ్యమంత్రయ్యారు. వారు మళ్లీ గంపెడాశతో అధికారులను కలిశారు. ఇదిగో అదిగో అన్నారే కానీ... ఫలితం లేకపోయింది.

దాంతో వారు టీడీపీ యువనేత లోకేశ్ ను కలిశారు. ఏళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను ఆయనకు చెప్పారు. లోకేశ్ స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడారు. అధికారులకు ఇక స్పందించక తప్పలేదు. ఫైళ్లు కదిపారు.. పది రోజుల్లో సమస్య పరిష్కారమైంది.. 225 మందికి పట్టాలు ఇచ్చారు.. దీంతో ఆ నిరుపేద కళ్లో ఆనందం... దశాబ్దాల తమ కష్టాన్ని తుడిచేసి తమకు నీడ కల్పించిన నాయకుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు. టీడీపీ కార్యాలయానికి వచ్చి తమ ఆనందాన్ని లోకేశ్ తో పంచుకున్నారు. లోకేశ్ ఆ ఆనందాన్ని ట్విట్టర్, ఫేస్ బుక్ లో పంచుకున్నారు.