Begin typing your search above and press return to search.

లోకేశా.. కాపీయింగ్ పాలిటిక్స్ మానవా... ?

By:  Tupaki Desk   |   19 Aug 2021 9:30 AM GMT
లోకేశా.. కాపీయింగ్ పాలిటిక్స్ మానవా... ?
X
చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్. ఆయన తండ్రిని చూసుకుని తానూ అంతే సమానం అనుకుంటారు. దీంతోనే తమ్ముళ్లతో ఎడం వచ్చిందని కూడా చెబుతారు. ఇక రాజకీయాల్లో చూసుకుంటే లోకేష్ జూనియర్ కిందనే లెక్క. ఆయన మంత్రి అయ్యారు. అయిదు శాఖలు చేపట్టారు అని ఎవరైనా వాదించవచ్చు కానీ అవన్నీ చంద్రబాబు దయతో వచ్చినవే.

ఇక ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా బాబు ఇచ్చిందే తప్ప జనం నుంచి సాధించినది కాదు. ఏ మాత్రం రాజ‌కీయ అనుభ‌వం లేని లోకేష్ ఎమ్మెల్సీ అయిన రెండు రోజుల‌కే మంత్రి అవ్వ‌డంపై అనేకానేక విమ‌ర్శలు వ‌చ్చాయి. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఏ మాత్రం రాజ‌కీయ ఓన‌మాలు నేర్చుకోలేదు. మంగళగిరిలో పోటీ చేస్తే లోకేష్ ఓటమి పాలు అయ్యారు. అలా బాగా చులకన అయ్యారు. నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరమైన ఓటమి ఒక ఎత్తు అయితే... లోకేష్ ఓటమి పాలు కావడం మహా ఘోరమైన పరాజయం. లోకేష్ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఇది పెద్ద మ‌చ్చ‌గా మిగిలిపోనుంది.

ఈ ఓడిన లోకేష్ గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేతల మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. దాంతోనే చిర్రెత్తుకు వస్తోంది. రాజకీయాల్లో నాయకుడు విజయాలు సాధించాలి. అపుడే క్యాడర్ మాట వింటుంది. అలాంటి విజయం కోసం లోకేష్ శ్రమించాలి. జగన్ ఈ రోజు పెద్ద నాయకుడు అయ్యారు అంటే ఆయన తాను గెలుస్తున్నారు. పార్టీని గెలిపిస్తున్నారు. లోకేష్ అయితే తండ్రి పార్టీలో ఉంటూ హోదాను అనుభవిస్తున్నారు. ఈ తేడాను తమ్ముళ్ళు గుర్తించబట్టే లోకేష్ తేలిపోతున్నారు అని అంటున్నారు.

ఇక లోకేష్ జగన్ ని ఫాలో అవుతున్నారు. ఆయన్ 2014 నుంచి 2019 వరకూ జగన్ ఏం చేశారో అదే చేయాలనుకుంటున్నారు. అయితే జగన్ ది ఒరిజినల్. పైగా ఆయన వెనక ఎవరూ లేరు. ఆయన రాజకీయం ఒక రకంగా ఫ్రెష్ కిందకే లెక్క. లోకేష్ ది అలా కాదు కదా చంద్రబాబు పాలన కళ్ల ముందే ఉంది. ఆ ఫెయిల్యూర్స్ కూడా జనానికి గుర్తు ఉన్నాయి. దాంతో జగన్ మాదిరిగా సర్కార్ మీద ఒక విమర్శ చేస్తే అది తిరిగి తనకే చుట్టుకుంటోంది. తన తండ్రి ఏలుబడిని కూడా గుర్తు చేస్తుంది.

మరో వైపు జగన్ లా మాస్ ఇమేజ్ తెచ్చుకుందామని లోకేష్ చేస్తున్న విన్యాసాలు కూడా చివరికి బెడిసికొడుతున్నాయి. లోకేష్ నాయకుడిగా నిలబడాలి అంటే ఒరిజినాలిటీతోనే ఉండాలని సూచనలు అందుతున్నాయి. ఆయన తనదైన స్టైల్ లోనే జనాల మద్దతు పొందాలని సూచిస్తున్నారు. అయినా ఒకరి రాజకీయం మరొకరికి ఎప్పటికీ కలసి రాదు. సో లోకేష్ ఆ విషయం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని కూడా అంటున్నారు.