Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో హీట్.. జ‌గ‌న్ ఇలాకాలో లోకేష్‌!

By:  Tupaki Desk   |   14 Oct 2022 1:20 PM GMT
ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో హీట్.. జ‌గ‌న్ ఇలాకాలో లోకేష్‌!
X
ఇప్ప‌టికే ఏపీ రాజ‌కీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. వ‌ర్షాకాలంలోనూ ఏపీ రాజ‌కీయాలు హీటెక్కాయి. మూడు రాజ‌ధానుల అంశం ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. మూడు రాజ‌ధానుల అంశానికి అనుకూలంగా, వ్యతిరేకంగా అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షాలు ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. అక్టోబ‌ర్ 15న మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ మ‌ద్దతుతో విశాఖ‌లో భారీ ర్యాలీ జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు అదే రోజు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పార్టీ కార్య‌క్ర‌మాల కోసం విశాఖ వ‌స్తుండ‌టంతో ఈ హీట్ అమాంతం పెరిగిపోయింది.

మ‌రోవైపు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌.. వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇలాకా అయిన ఆయ‌న సొంత జిల్లా క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరుకు నారా లోకేష్ రానున్నారు. దీంతో ఏపీ రాజ‌కీయాలు వ‌ర్షాకాలంలోనూ వేస‌వి ఉక్క‌పోత‌ను త‌ల‌పిస్తున్నాయి.

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీవీ ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ ఇంటికెళ్లి ధ‌ర్నా చేయ‌డ‌మే కాకుండా స్థానిక టీడీపీ నాయ‌కుల‌పై వైసీపీ నేత‌లు దాడికి దిగార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ నాయ‌కుల‌పై కేసులు పెట్టార‌ని అంటున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీవీ ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి పై అక్ర‌మ కేసులు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆయ‌న‌ను జైల్లో పెట్టార‌ని నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి అరెస్టును లోకేష్ తీవ్రంగా ఖండించారు.

కేవ‌లం ఖండించ‌డంతోనే ఆగ‌కుండా నారా లోకేష్ అక్టోబ‌ర్ 15న క‌డ‌ప వెళ్ల‌నున్నారు. అక్క‌డ‌ సెంట్ర‌ల్ జైల్లో ఉన్న జీవీ ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డిని ప‌రామ‌ర్శించ‌నున్నారు. కాగా ఇప్ప‌టికే ప్ర‌వీణ్ కుమార్ రెడ్డిని విడుద‌ల చేయాల‌ని లోకేశ్ డిమాండ్ చేశారు. త‌ప్పు చేసినా వైసీపీ నేత‌ల‌ను వ‌దిలిపెట్టి త‌మ పార్టీ నేత‌ల‌ను పోలీసులు వేధించ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో త‌మ పార్టీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను త‌ట్టుకోలేక టీడీపీ నేత‌ల‌ను వేధిస్తోంద‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు, నారా లోకేష్ మండిప‌డుతున్నారు. టీడీపీ నేత‌ల‌ను అరెస్టు చేయ‌డంలో చూపుతున్న ఉత్సాహం పోలీసుల‌కు వైసీపీ నేత‌ల‌ను అరెస్టు చేయ‌డంలో లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా త‌మ నేత‌లు అరెస్టు అయిన చోటకు అటు చంద్ర‌బాబో, ఇటు నారా లోకేషో వెళ్లి భ‌రోసా క‌ల్పిస్తున్నారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ధైర్యం చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే నారా లోకేష్ అక్టోబ‌ర్ 15న శ‌నివారం క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు రానున్నారు. దీంతో ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయాలు హీటెక్కాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.