Begin typing your search above and press return to search.

లోకేష్ రూటు మార్చాల్సిందేనా ?

By:  Tupaki Desk   |   27 Aug 2021 4:30 AM GMT
లోకేష్ రూటు మార్చాల్సిందేనా ?
X
నారా లోకేష్ కి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిలో ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. టీడీపీ వారు ఆయన్ని చినబాబు అని పిలుస్తారు. అదే విపక్షాలు పప్పు అని ఎగతాళీ చేస్తారు. ఇక విజయసాయిరెడ్డి లాంటి వారు మా లోకం అని పేరు పెట్టేశారు. నిజానికి మా లోకం అంటే ఏమీ తెలియని అజ్ణాని అని అర్ధం. ఆ విధంగా లోకేష్ ని తీసికట్టు చేస్తూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీటే ట్వీట్లు చినబాబుకు ఏమో గానీ ఆయన అభిమానులకు మండించేలా ఉంటాయి. ఇక ఏపీలో ఇప్పుడు చినబాబు తెగ‌ తిరిగేస్తున్నాడు, హుషార్ చేస్తున్నాడు అని తమ్ముళ్ళు మురిసిపోతున్నారు కానీ ఇప్పటిదాకా లోకేష్ చేసిన టూర్లు అన్నీ కూడా పరామర్శలే. ఎవరో చనిపోతే వెళ్ళడం ఆ కుటుంబాన్ని పరామర్శించడం. అక్కడ నుంచే జగన్ కి సవాళ్ళు చేయడం. ఇవే చినబాబు ఈ కరోనా టైమ్ లో పెంచుకున్న నాయకత్వ లక్షణాలు అంటే తమ్ముళ్ళు బాధపడక తప్పదు.

తాజాగా గుంటూరులో రమ్య అనే బీటేక్ చదివే విద్యార్ధిని చనిపోయింది. ఆమె మరణించిన తరువాత ఒక్కసారిగా కులాన్ని ముందుకు తెచ్చారు.దాంతో చినబాబు అక్కడికి వెళ్ళి పరామర్శ పేరిట చేసిన యాగీ టీడీపీకి మైనస్ అయింది అన్న మాట ఉంది.మరో వైపు రమ్య కుటుంబం జగన్‌ను మెచ్చుకుంది. జగన్ మాకు అండగా ఉన్నారు అని కూడా చెప్పుకుంది. అదే విధంగా ప్రభుత్వం వేగంగా స్పందించి దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేసింది అని జాతీయ ఎస్సీ కమిషన్ కూడా కితాబు ఇచ్చింది. దాంతో ఇపుడు టీడీపీ పరిస్థితి ఇరాకాటంలో పడింది.

రాష్ట్రంలో ఎస్సీలను తమ వైపు తిప్పుకుందామని విశాఖలోని మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం నుంచి టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకో వర్కౌట్ కావడం లేదు సరికదా ఎదురు తంతున్నాయి. అదే విధంగా టీడీపీ దూకుడు కూడా ఆ పార్టీ కొంప ముంచుతోంది. ముందే ఒక నిర్ధారణకు వచ్చి వైసీపీని జగన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కూడా టీడీపీ అసలు ఉద్దేశ్యాలు ఏమున్నా పక్కకు పోయేలా చేస్తోంది. అంటే ప్రతీ దానిలో రాజకీయాలనే చూసుకుంటున్నారు అన్నది తెలిసిపోతోంది. దీంతో పాటు చినబాబు కేవలం శవ యాత్రలే చేస్తున్నారు అన్న పేరు ఇప్పటికే వచ్చేసింది.

ఇకనైనా లోకేష్ ఈ రూట్ మార్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని అంటున్నారు. అలాగే అయిన దానికి కాని దానికీ జగన్ మీద చిందులు వేసే కన్నా ప్రజలకు తాము ఎంత వరకూ అండగా ఉన్నామన్నది బేరీజు వేసుకుని ముందుకు సాగాలి. నిజానికి ప్రజలు తమకు అండగా ఉన్న వారిని ఎపుడూ మరచిపోరు. కచ్చితంగా టీడీపీ చిత్తశుద్ధితో పనిచేసే ఆ పార్టీకి ఓటేయడానికి వారు రెడీగా ఉంటారు. కానీ శవ రాజకీయాలు చేస్తే మాత్రం ఇక మీదట ఇంటికి రావద్దు అని బోర్డు పెట్టి మరీ తలుపులు మూసుకున్నా మూసుకుంటారు.