Begin typing your search above and press return to search.

స‌గం నిజ‌మే చెప్పావేం లోకేష్‌ బాబు?

By:  Tupaki Desk   |   9 Dec 2015 4:10 PM GMT
స‌గం నిజ‌మే చెప్పావేం లోకేష్‌ బాబు?
X
తెలుగుదేశం యువ‌నేత నారా లోకేష్ అంచ‌నా వేసిన‌ట్లుగానే రాజ‌కీయాల్లో క్రియాశీలంగా మారుతున్నారు. మొద‌టి మొట్టు నుంచి ఎదుగుతూ పోవాల‌నే పాయింట్‌ ను ప‌ట్టుకున్న లోకేష్ ముందుగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి..ఆ త‌ర్వాత కార్య‌క‌ర్త‌ల సంక్షేమ నిధి క‌న్వీన‌ర్‌ గా ప‌గ్గాలు చేప‌ట్టారు. అనంత‌రం నాయ‌కుల‌కు ఏర్పాటు చేసిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో కీల‌క పాత్ర పోషించారు. తాజాగా పార్టీకి-ప్రభుత్వానికి అనుసంధానం క‌లిగించేందుకు ఉద్దేశించిన జ‌న చైత‌న్య యాత్ర‌లో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. యాత్ర‌లో భాగ‌స్వామ్యం అవుతూ టీడీపీ చెప్పింది..చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న‌దాని గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే లోకేష్ చెప్పిన వివ‌రాలు ఆస‌క్తిక‌రంగానే ఉన్న‌ప్ప‌టికీ అందులో స‌గ‌మే నిజం ఉంద‌నే భావన వినిపిస్తోంది.

జనచైతన్య యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో లోకేష్‌ మాట్లాడారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు వ‌స్తున్నా మీకోసం పాదయాత్ర చేప‌ట్టి ప్రజల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నార‌ని ప్ర‌స్తావించారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు 400 హామీలిచ్చార‌ని లోకేష్ చెప్పారు. అయితే సీఎంగా చంద్ర‌బాబు అధికారం చేపట్టాక 18 నెలల్లో 200 హామీలు నెరవేర్చార‌ని..ఇంత స్వ‌ల్ప స‌మ‌యంలోనే స‌గానికి పైగా హామీల‌ను నెర‌వేర్చిన‌ ఘనత చంద్రబాబుకే దక్కిందని కితాబిచ్చారు. చంద్ర‌బాబు సీఎం అయిన త‌ర్వాత రూ.24 వేల కోట్లు రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రూ.10 వేల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. కాపు సంక్షేమ నిధి కోసం రూ.100 కోట్లు కేటాయించారని, వారిని బీసీల్లో చేర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప‌ట్టిసీమతో పంట‌పొలాల‌ను స‌స్య‌శ్యామ‌లం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కింద‌న్నారు. ఇంతేకాకుండా...ప్రణాళికాబద్ధంగా రాష్టాభివృద్ధికి అనేక ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టార‌ని వివ‌రించారు.

అయితే చంద్ర‌బాబు ప‌రిపాల‌న గురించి లోకేష్ చెప్పిన వాటిలో నిజం ఉన్న‌ప్ప‌టికీ... ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన‌ ప్ర‌ధాన హామీలు అయిన రుణ‌మాఫీ - డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీలో పెద్ద ఎత్తున గంద‌ర‌గోళం నెల‌కొంది. రుణ‌మాఫీ విష‌యంలో ప్ర‌భుత్వం విధించిన ఆధార్ కార్డ్ త‌ప్ప‌నిస‌రి అనే నిబంధ‌న‌తో అనేక‌మంది అవ‌స్త ప‌డ్డారు. ఇప్ప‌టికీ ఈ మాఫీ ప్ర‌క్రియ ఓ కొలిక్కి రాని ప‌రిస్థితి. అదే క్ర‌మంలో డ్వాక్రా మ‌హిళ‌లు సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత పూర్తిస్థాయిలో మాఫీ జ‌ర‌గ‌లేదు. బీఈడీ విద్యార్థుల‌కు డీఎస్సీలో అవ‌కాశం క‌ల్పించ‌డం - నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు - నిరుద్యోగ భృతి విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై పూర్తి వ్య‌తిరేక ఉంద‌నేది ప్ర‌తిప‌క్షాల ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా సంగ‌తి స‌రేసరి. మొత్తంగా కీల‌క హామీలు అమ‌లుకు నోచుకోకుండా ఉండిపోయిన నేప‌థ్యంలో లోకేష్ చెప్పిన మాట‌లు చంద్ర‌బాబు స‌గం విజ‌యం సాధించార‌నే విష‌యాన్ని ప‌రోక్షంగా చెప్తున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చెప్తున్నారు.