Begin typing your search above and press return to search.

లోకేష్ ను బయటకు పంపితే ఇలాగే ఉంటుంది

By:  Tupaki Desk   |   13 Aug 2021 5:30 AM GMT
లోకేష్ ను బయటకు పంపితే ఇలాగే ఉంటుంది
X
ఏమి మాట్లాడుతాడో తెలీదు. ఎప్పుడేమి మాట్లాడాలో కూడా తెలీదు. మీడియా కనిపిస్తే నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్ప తాను మాట్లాడేదానిలో లాజిక్ ఉందా అని చూసుకునే రకం కాదు నారా లోకేష్. అందుకనే లోకేష్ ను బయట తిప్పటం కన్నా ట్విట్టర్ లో కూర్చోబెట్టడమే మంచిదని ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబునాయుడుకు సలహా ఇచ్చారట. ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా నెల్లూరు జిల్లాలో లోకేష్ పర్యటించారు.

నిరుద్యోగి కమల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకని ఈ యువకిశోరం నెల్లూరు టౌన్ కు వచ్చారు. అయితే ఈయన వెళ్ళిన సమయానికి నిరుద్యోగి కుటుంబసభ్యులెవరు ఇంట్లో లేరు. దాంతో తాళం వేసుకున్న ఇంటిబయటే కమల్ ఫొటోకు నివాళులర్పించి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మీడియాతో చాలా ఆవేశంగా మాట్లాడారు.

లోకేష్ ఏమి మాట్లాడినా సింగిల్ పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని లేదా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటమే కదా. ఇపుడు కూడా అలాగే మాట్లాడారు. దాంతో లోకేష్ మాటలు విన్న ఇతర నేతలు ఆశ్చర్యపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఎంబీఏ చదువుకున్న కమల్ కు గడచిన పదేళ్ళుగా ఉద్యోగం రాలేదన్న బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కమల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగి కుటుంబానికి రు. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు.

నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించకపోతే చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తామే చెల్లిస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. పదేళ్ళు కమల్ కు ఉద్యోగం రాలేదని చెప్పిన లోకేష్ కు అందులో ఐదేళ్ళు తామే ప్రభుత్వంలో ఉన్నామని మరచిపోయారు. మరి కమల్ కు తమ ప్రభుత్వం ఎందుకని ఉద్యోగం కల్పించలేకపోయింది ? పదేళ్ళ కమల్ నిరుద్యోగంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నది రెండేళ్ళే కదా. మిగిలిన ఎనిమిదేళ్ళు టీడీపీ, కాంగ్రెస్సే కదా అధికారంలో ఉన్నది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలకు కూడా జగన్ దేనా బాధ్యత ?

అంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతోందేమంటే తమ ప్రభుత్వం ఫెయిల్యూర్లను కూడా జగన్ ఖాతాలో వేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని. ఆత్మహత్య చేసుకున్న కమల్ కు తమ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం చూపించలేదో సమాధానం చెప్పాల్సింది తానే అన్న విషయం లోకేష్ మరచిపోయారు. ఎంబీఏ చదివిన యువకుడికి పదేళ్ళయినా ఎక్కడా ఉద్యోగం రాలేదంటే లోపం ఎక్కడుందో చూడాలన్న కనీస ఇంగితం కూడా లోకేష్ లో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ అవకాశం దొరికినా జగన్ పై బురద చల్లేయాలన్న ఆతృతే తప్ప ఆలోచన కనబడటంలేదు.