Begin typing your search above and press return to search.

ఈ అరెస్ట్‌.. లోకేశ్ రాత మార్చేనా?

By:  Tupaki Desk   |   17 Aug 2021 4:30 PM GMT
ఈ అరెస్ట్‌.. లోకేశ్ రాత మార్చేనా?
X
వార‌స‌త్వ రాజ‌కీయాలు దేశంలో కొత్తేమీ కాదు. ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కూ.. త‌మ త‌ల్లిదండ్రుల బాట‌లో న‌డుస్తూ ఎంతో మంది బిడ్డ‌లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వాళ్ల‌లో కొంత‌మంది డ‌క్కామొక్కీలు తిని బ‌లంగా నిల‌బ‌డితే మ‌రికొంత మంది మాత్రమే అల‌వాటు ప‌డ‌లేక మ‌ధ్య‌లోనే నిష్క్ర‌మించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కొద‌వ లేదు. అటు ఏపీలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఇటు తెలంగాణ‌లో సీఏం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కులుగా ఎదిగారు.

కానీ ఎటొచ్చి మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కొడుకు నారా లోకేశ్ ప‌రిస్థితి మాత్ర‌మే బాగాలేదు. త‌న తండ్రి హ‌యాంలో ఎమ్మెల్సే ప‌ద‌వి ద‌క్కించుకుని ఆన‌క మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన లోకేశ్‌.. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చెందారు. బాబుకు వ‌య‌సు మీద ప‌డుతుండ‌డంతో పార్టీ బాధ్య‌త‌లు చిన్న‌బాబు అయిన లోకేశ్‌కు అప్ప‌గిద్దామంటే ఆయ‌నేమో త‌న సామ‌ర్థ్యాన్ని చాటుకోలేక‌పోతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో తాజాగా గుంటూరులో హ‌త్య‌కు గురైన విద్యార్ఙిని ర‌మ్య కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ఆయ‌న అరెస్ట‌య్యారు. మ‌రి ఈ అరెస్ట్ ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని మ‌లుపు తిప్పుతుందా చూడాలి.

ప్ర‌జా నాయ‌కులంటే జ‌నాల్లోనే ఉండాలి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడూ వాళ్ల‌కు తామున్నామంటూ భ‌రోసా క‌ల్పించాలి. అలా చేస్తేనే ప్ర‌జ‌ల‌కు నాయ‌కుల‌పై న‌మ్మ‌కం క‌లుగుతోంది. పాద‌యాత్ర‌తో అధికారంలోకి వ‌చ్చిన వైఎస్సార్ దానికి నిద‌ర్శ‌నం. ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ కూడా ఓదార్పు యాత్ర‌, పాద‌యాత్ర అంటూ ప్ర‌జ‌ల్లో గ‌డిపారు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోనే ఎక్కువ‌గా గ‌డిపారు. అధికార పార్టీపై వ్య‌తిరేక‌త‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లారు.

2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి తొలిసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. కానీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లే విష‌యంలో లోకేశ్ ఆల‌స్యం చేశార‌నే చెప్పాలి. అధికారంలో ఉన్న‌ప్పుడు కానీ ఇప్పుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన‌ కార్య‌దర్శిగానూ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేదు. దీంతో ఇటు పార్టీలోనూ.. అటు జ‌నాల్లోనూ ఆయ‌న నాయ‌క‌త్వ సామ‌ర్థ్యంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి.

కానీ ఇటీవ‌ల కాలంలో లోకేశ్ దూకుడు పెంచార‌నే చెప్ప‌వచ్చు. ఎప్ప‌టిక‌ప్పుడూ అంత‌ర్జాలం ద్వారా కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌మే కాకుండా ఏ ప్ర‌ధాన స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే స్పందిస్తున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై విమ‌ర్శ‌ల్లో ప‌దును పెంచారు. ఏ సంఘ‌ట‌న జ‌రిగినా అక్క‌డికి వెళ్తున్నారు. ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరు తెచ్చుకునేందుకు తాప‌త్రాయ‌ప‌డుతున్నారు.

అందులో భాగంగానే ఇప్పుడు గుంటూరు వెళ్లిన ఆయ‌న అరెస్ట‌య్యారు. త‌న రాజ‌కీయ జీవితంలో తొలిసారి అరెస్ట‌యిన ఆయ‌న‌.. ఇప్ప‌టి నుంచి మ‌రింత జోరు పెంచే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ అరెస్టే ఆయ‌న రాజ‌కీయ జీవితంలో ఓ మ‌లుప‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లోకేశ్ ఇదే స్పీడ్‌తో సాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో టీడీపీని విజ‌యం దిశ‌గా న‌డిపించాల‌ని తెలుగు త‌మ్ముళ్లు కోరుకుంటున్నారు.