Begin typing your search above and press return to search.

కుప్పంలో లోకేష్ సెంటిమెంట్ పనిచేస్తుందా ?

By:  Tupaki Desk   |   13 Nov 2021 6:38 AM GMT
కుప్పంలో లోకేష్ సెంటిమెంట్ పనిచేస్తుందా ?
X
రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా లోకేష్ కుప్పంలో పర్యటించారు. తన పర్యటనలో బాగా సెంటిమెంట్ రంగరించి ఓటర్లతో ఎమోషనల్ గా కనెక్టయ్యే ప్రయత్నం చేశారు లోకేష్. కుప్పం ఎన్నికలు ఆత్మగౌరవానికి సంబంధించినదని చెప్పటమే విచిత్రంగా ఉంది. కుప్పం ప్రజలు టీడీపీని కాకుండా వైసీపీని గెలిపిస్తే వాళ్ళకు ఆత్మగౌరవం లేదని మిగిలిన వాళ్ళు అనుకోవాలా ? ఓట్లేసి జనాలు టీడీపీని గెలిపించాలని అనుకుంటే వాళ్ళని బతిమలాడుకోవటం ఒకటే మార్గం.

ఈ మధ్యనే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబునాయడు కూడా సెంటిమెంటును రగిల్చేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవటంతో చివరకు శాపనార్ధాలు పెట్టారు. ఓటర్లను సిగ్గులేదా అంటు తిట్టారు. మీకు అసలు పౌరుషమే లేదా అంటు రెచ్చగొట్టారు. గుంటూరు కార్పొరేషన్లో వైసీపీకి ఓట్లేసి గెలిపిస్తే అమరావతి తరలింపుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే అని సెంటిమెంటును ప్రయోగించారు. అయితే చంద్రబాబు ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా జనాలైతే చివరకు వైసీపీనే గెలిపించారు.

అంటే అప్పట్లో ఫెయిలైన చంద్రబాబు సెంటిమెంట్ ప్రయోగాన్ని ఇపుడు లోకేష్ కుప్పంలో ప్రయోగిస్తున్నారు. ఓటర్ల విజ్ఞతను నేతలు ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఓడించాలో గెలిపించాలో ఓటర్లుకు బాగా తెలుసు. వైసీపీకి కుప్పం ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని, డబ్బుకు అమ్ముడుపోయేవారు కాదని లోకేష్ చాలా మాటలే మాట్లాడారు. నిజంగా ఓటర్లను ఆకట్టుకోవాలని లోకేష్ కు ఉంటే తమ ఐదేళ్ళ హయాంలో కుప్పం అభివృద్ధికి ఏమి చేశారు ? ఈ రెండున్నరేళ్ళల్లో వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో వివరించాలి.

నియోజకవర్గం లేదా కుప్పం అభివృద్ధి గురించి లోకేష్ మాట్లాడకుండా ఎంతసేపు దౌర్జన్యాలని, రౌడీలని అనవసరమైన మాటలు మాట్లాడితే ఎలాంటి ఉపయోగం ఉండదని గ్రహించాలి. అనవసరంగా గెలుపుకు, ఆత్మగౌరవానికి లింకు పెట్టారు. రేపటి ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు లేదా లోకేష్ కుప్పంలో పర్యటించగలరు ? ఆత్మగౌరవం సెంటిమెంటును లోకేష్ ప్రయోగించిన తర్వాత కూడా టీడీపీ ఓడిపోయిందంటే ప్రజలు చంద్రబాబు, లోకేష్ ను తిరస్కరించినట్లే కదా.

ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణాలోని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్ ఆత్మగౌరవం నినాదం లోకేష్ కు బాగా నచ్చినట్లుంది. హుజూరాబాద్ ఉపఎన్నికకు కుప్పం మున్సిపల్ ఎన్నికకు అసలు పోలికేలేదు. వైసీపీ ప్రభుత్వం మీద నిరసనగా చంద్రబాబు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలు వచ్చినపుడు ఆత్మగౌరవం నినాదాన్ని ప్రస్తావించినా అదో లెక్క. అంతేకానీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి ఎక్కడో హైదరాబాద్ లో కూర్చునే లోకేష్ కూడా ఆత్మగౌరవం అంటే జనాలు పట్టించుకుంటారా ?