Begin typing your search above and press return to search.

లోకేశ్ మాటల్ని వింటే.. పచ్చ కామెర్ల సామెత గుర్తుకు రావటం ఖాయం

By:  Tupaki Desk   |   22 Nov 2019 10:49 AM GMT
లోకేశ్ మాటల్ని వింటే.. పచ్చ కామెర్ల సామెత గుర్తుకు రావటం ఖాయం
X
సాధారణంగా అధికారపక్షానికి ఒక ఇబ్బంది ఉంటుంది. చేతిలో అధికారం ఉంటే ఏదో ఒక విషయంలో ఇరుకున పడుతూ ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సిత్రంగా ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా అధికారపక్షానికి అడ్వాంటేజ్ తో ఉంటే.. విపక్షం మాత్రం తరచూ ఇరుకున పడే పరిస్థితి. దీనికి కారణం.. ఆచితూచి అడుగులు వేస్తూ.. ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో చకచకా నిర్ణయాలు తీసుకుంటూ పాలనా రథాన్ని పరుగులు తీయిస్తున్నారు.

విపక్షం విషయానికి వస్తే.. అధికార పక్షానికి ఇవ్వాల్సిన కనీస సమయం ఇవ్వకుండా అదే పనిగా విమర్శలు చేస్తుండటంతో ప్రజల్లోనూ చులకన అయిన పరిస్థితి. అదే సమయంలో విపక్షం చేస్తున్న విమర్శలకు ధీటుగా బదులివ్వలేని దుస్థితి. పాదయాత్రలోనూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని వరుస పెట్టి అమలు చేస్తున్న వేళ.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న విపక్షం.. ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
వరదల కారణంగా ఇసుక రీచ్ లలో ఇసుక తీయలేని వేళ.. కొరతతో ఇబ్బంది పడితే.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా నానా యాగీ చేసేందుకు ప్రయత్నం చేయటం.. ఇసుక కొరత తీరిపోవటంతో నోటి వెంట మాట రాని ప్రతిపక్షం ఇప్పుడు ఏదోలా ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయాలన్నట్లు కంకణం కట్టుకుంది.
తాజాగా గుంటూరులో జరిగిన కార్యక్రమానికి హాజరైన నారా లోకేశ్.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ హయాంలో ఫ్యాక్షనిజం చూశామని.. జగన్ ప్రభుత్వంలో సైకోయిజం చూస్తున్నట్లు చెప్పారు. కొంతమంది పోలీసులు అధికారపక్ష నేతల మాటలు వింటున్నారని.. ఈ కారణంగా పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తోందన్నారు.

టీడీపీ హయాంలో పోలీసులపై ఒత్తిడి చేశామా? అని ప్రశ్నించిన లోకేశ్ మాటలు చూస్తే.. గతం మర్చిపోయారనిపించక మానదు. ఎక్కడిదాకానో ఎందుకు చింతమనేని ఎపిసోడ్ ను ఎవరు మాత్రం మర్చిపోగలరు. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పారని.. కానీ షాపులు మాత్రం మూతపడలేదన్న లోకేశ్.. ఏపీ సర్కారు రాజధాని లేకుండా చేస్తుందన్నారు.

రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందన్నారు. రాజధానిపై మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటాన్ని తప్పు పట్టారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న వేళ.. అమరావతిని రాజధానిగా ఉంచేందుకు జగన్ ఒప్పుకున్నారని.. అధికారం ఉన్న వేళ.. ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా చూస్తే.. తాము కోరుకున్నట్లుగా జగన్ పాలన చేయాలన్న తీరు కనిపిస్తుంది. అంతేకాదు.. పచ్చకామెర్ల సామెత కూడా లోకేశ్ మాటల్లో కనిపిస్తుందని చెప్పక తప్పదు.