Begin typing your search above and press return to search.

లోకేష్ రాజ‌కీయం మారింది.. అయినా.. !

By:  Tupaki Desk   |   21 Aug 2021 1:51 AM GMT
లోకేష్ రాజ‌కీయం మారింది.. అయినా.. !
X
టీడీపీ యువ నాయ‌కుడు, భావి టీడీపీ అధినేత‌గా ప్ర‌చారంలో ఉన్న నారా లోకేష్‌.. ఇటీవ‌ల కాలంలో రాజకీయాల‌ను ఒకింత ఛేంజ్ చేసుకున్నారు. త‌న ముఖ‌క‌వ‌ళిక‌ల నుంచి రాజ‌కీయ వ్యాఖ్య‌ల వ‌ర‌కు కూడా.. త‌న విధానాన్ని సంపూర్ణంగా మార్చుకున్నారు. ప్ర‌భుత్వంపై చేసే విమ‌ర్శ‌ల విష‌యంలోనూ ఆయ‌న ఆచితూచి ప‌దును పెంచుతున్నారు. గ‌తంలో తెలుగు మాట్లాడ‌డం రాద‌నే విమ‌ర్శ‌ల‌కు కూడా త‌న‌దైన శైలిలో చెక్ పెట్టారు. ఎక్క‌డ ఎవ‌రు ఇబ్బందుల్లో ఉన్నా.. వెంటనే వెళ్లి ఆయా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా యువ‌త‌ను కూడా త‌న వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్న తీరు కూడా బాగానే ఉంద‌నే మార్కులు ప‌డుతున్నాయి. అయితే.. ఇంత చేస్తున్నా.. లోకేష్ రాజకీయం మారింద‌ని.. ఆయన పుంజుకుం టున్నార‌ని అంటున్నా.. ఎక్క‌డో ఏదో వెలితి మాత్రం లోకేష్‌ను వెంటాడుతోంది. ఆయ‌న వ్య‌వ‌హారశైలి మారినా.. ఆయ‌న పుంజుకుంటున్న‌ట్టు క‌నిపిస్తున్నా.. సొంత పార్ట‌లోనే సీనియ‌ర్లు.. లోకేష్‌ను లెక్క చేయ‌డం లేదు. ఎవ‌రూ కూడా సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి చంద్ర‌బాబుకు ఉన్న ఫాలోయింగ్ దాదాపు ప‌దేళ్లుగా లోకేష్ పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించినా.. అందిపుచ్చుకోలేక పోయారు.

పైగా.. క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనూ లోకేష్‌కు మార్కులు ప‌డ‌డం లేదు. ధూళిపాళ్ల న‌రేంద్ర వంటి టీడీపీలో వ్య‌వ‌స్థాగ‌తంగా ఉన్న కుంటాబాలకు కూడా లోకేష్ చేరువ కాలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, క‌మ్మ వ‌ర్గంలోని పారిశ్రామిక‌వేత్త‌లు, మేధావులు కూడా లోకేష్ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. చంద్ర బాబు మాట్లాడితే.. ఒకింత ఊపు వ‌స్తోంది కానీ.. లోకేష్ మాట్లాడితే.. గుర్తించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఈ ప‌రిణామాల‌తో.. లోకేష్‌కు సొంత పార్టీలోని సీనియ‌ర్లు, క‌మ్మ వ‌ర్గం క‌లిసి వ‌చ్చేలా.. చేయాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై ఉంద‌ని.. అదే స‌మయంలో అస‌లు త‌న లోపాల‌ను మ‌రింత నిశితంగా లోకేష్ కూడా గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఆదిశ‌గా లోకేష్ అడుగులు వేస్తారో.. లేక వ‌చ్చిన ఇమేజ్ చాల‌ని స‌రిపెట్టుకుంటారో చూడాలి.