Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ప్లీన‌రీ రోజే లోకేష్ కొత్త అడుగు

By:  Tupaki Desk   |   24 April 2016 9:18 AM GMT
టీఆర్ ఎస్ ప్లీన‌రీ రోజే లోకేష్ కొత్త అడుగు
X
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ ఎస్ ప్లీన‌రీ ఈనెల 27న ఖ‌మ్మంలో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సైతం మరో కీల‌క అడుగు వేసేందుకు స‌న్న‌ద్ధం అయింది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక రాజ‌ధాని అయిన విశాఖ‌ప‌ట్ట‌ణంలో ఇప్ప‌టివ‌ర‌కు పార్టీ కార్యాల‌యం లేక‌పోవ‌డంతో అన్ని హంగులతో కూడిన కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు తేదీని ఖ‌రారు చేసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో, యువనేత నారా లోకేష్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని విశాఖ జిల్లా నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 27న కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు పార్టీ వర్గాలు ముమ్మర యత్నాలు ప్రారంభించాయి.

గతంలో తెలుగుదేశం పార్టీకి సారధ్యం వహించిన నేతలు - పార్టీ సానుభూతి పరులు ఇచ్చిన భవనాల్లో కాలం వెళ్లదీసిన తెలుగుదేశం పార్టీ సొంత భవనాన్ని సమకూర్చుకోవడంలో వెనుకబడిందనే చెప్పాలి. పార్టీ అధికారంలో ఉండగా రామ్‌ నగర్‌ లోని సెవెన్‌ హిల్స్ ఆసుపత్రి వెనుకభాగంలో సుమారు అర ఎకరం స్థలాన్ని 33 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. సుమారు 14 సంవత్సరాల కిందట లీజుకు తీసుకున్న స్థలంలో రేకుల షెడ్ నిర్మించారు. ఇక్కడి నుంచి పార్టీ గత సాధారణ ఎన్నికల కార్యకలాపాలను నిర్వహించింది. అయితే ప్ర‌స్తుతం కొత్త భ‌వనాన్ని నిర్మించేందుకు స‌న్న‌ద్ధం అయ్యారు. అత్యాధునిక సదుపాయాలతో మూడంతస్తులుగా కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కింది అంతస్తులో సమావేశ భవనం - రెండో అంతస్తులో పార్టీ అధ్యక్షుడు - ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు - అనుబంధ సంఘాల ప్రతినిధులకు స్థానాలు ఏర్పాటు చేయనున్నారు. పై అంతస్తులో పార్టీ ప్రతినిధులకు వసతి - ఇతర సదుపాయాలు కల్పించేందుకు వీలుగా నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు.

సమావేశ మందిరం - అధ్యక్ష - ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలను పూర్తి ఏసీ సదుపాయంతో నిర్మిస్తారు. కార్యకర్తలకు శిక్షణ ఇతర కార్యకలాపాల కోసం పై అంతస్తును వినియోగిస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయ భవనాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించడం, దీనికి పార్టీ ప్రతినిధుల నుంచి సానుకూల స్పందన రావడంతో పనులు మొదలు పెట్టారు. కార్యాలయ నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడంతో పాటు నాయకులను సమన్వయం చేస్తున్న యువనేత లోకేష్ చొరవతోనే కార్యాలయ భవనం నిర్మాణ పనులకు కదలిక వచ్చిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.