Begin typing your search above and press return to search.

మోడీ కేబినెట్లో లోకేశ్ ?

By:  Tupaki Desk   |   22 Nov 2015 9:15 AM GMT
మోడీ కేబినెట్లో లోకేశ్ ?
X
టీడీపీ రాజకీయ వ్యూహం మారుతోందా...? పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఇక జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా...? అంటే జరుగుతున్న పరిణామాలన్నీ అవుననేలానే కనిపిస్తున్నాయి. టీడీపీలో అంతర్గత రాజకీయాలు, కేంద్రంలోని ఎన్డీయే భాగస్వామిగా టీడీపీ నెరపుతున్న రాజకీయాలు అన్నీ కూడా లోకేశ్ ఇక ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెప్పకనే చెబుతున్నాయి.

కేంద్రంలో టీడీపీ వ్యవహారాలన్న చూడడానికి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహనరావు ఉన్నారు. అయితే.. ఆయన అందరితోనూ మంచిగా ఉండే క్రమంలో మెతక వైఖరితో ఏమీ సాధించలేకపోతున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట. అదేసమయంలో చంద్రబాబుకు సన్నిహితుడైన టీడీపీ సడెన్ స్టార్ ఎంపీ సుజనాచౌదరి మాత్రం దూసుకెళ్లిపోతున్నారు. ఆయన కేంద్రంలో చురుగ్గా ఉంటున్నారు. అయితే.. ఆయన వల్ల టీడీపీకి కలుగుతున్న ప్రయోజనం కంటే ఆయనకు కలుగుతున్న స్వప్రయోజనాలే ఎక్కువ. పైగా ఇటీవల సుజనా చౌదరి ఏకంగా చంద్రబాబు తనయుడు లోకేశ్ నే అణగదొక్కాలని ట్రై చేస్తున్నట్లు పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో ఇక సుజనాకు చెక్ పెట్టబోతున్నట్లు సమాచారం. మరి... అలాంటప్పుడు కేంద్రంలో టీడీపీ వ్యవహారాలు ఎవరు చూస్తారన్న ప్రశ్న వస్తోంది. లోకేశ్ ఉండగా ఇంకెవరో ఎందుకున్న టీడీపీ పెద్దలు దానికి సమాధానం చెబుతున్నారు. తెలంగాణలో ఎలాగూ టీఆరెస్ తో మంచిగా పోయే ఉద్దేశంతో ఉండడంతో అక్కడ లోకేశ్ స్థాయిలో రాజకీయం నడిపే అవసరం లేదు. ఏపీలో చంద్రబాబు ఉండనే ఉన్నారు. దాంతో లోకేశ్ ను ఖాళీగా ఉంచకుండా ఢిల్లీ బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఢిల్లీలో వాళ్లపైనా, వీళ్లపైనా ఆధారపడకుండా కుమారుడిపై ఆధారపడడమే మంచిదని భావిస్తున్న చంద్రబాబు లోకేశ్ ను ఆ దిశగా రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు.

లోకేశ్ ఇకపై దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తారని... రానున్న కాలంలో ఏపీ రాజధాని అమరావతి కోసం నిధులు సాధించడం, అభివృద్ధి పనులు కోసం కేంద్రం సహాయం తేవడం వంటివన్నీ ఇప్పుడున్నవారు సమర్థంగా నిర్వహించలేకపోతున్నారు. దీంతో లోకేశయితే పనులు సాధించుకురాగలరని పార్టీ సీనియర్లూ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇందుకోసం వచ్చే లోక్ సభ ఎన్నికల వరకు ఆగకుండా త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి లోకేశ్ తో భర్తీ చేస్తారని సమాచారం. లోకేశ్ ను కేంద్ర మంత్రిని చేసే అవకాశాలూ కనిపిస్తున్నాయి. మరోవైపు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగియనుంది.. ఆ స్థానం ఖాళీ కాబోతోంది.

ఇప్పటివరకు చేపట్టిన ప్రతిపనినీ సమర్థంగా నిర్వహించిన నేపథ్యంలో ఢిల్లీలో టీడీపీకి లోకేశ్ ను పెద్ద దిక్కు చేస్తే ఫలితం ఉంటుందని.. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని భావిస్తున్నారు. అంతేకాదు.... జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉత్తరాది రాష్ట్రాల ముఖ్య నేతలను తీసుకుంటే వారి పిల్లలంతా ఎంపీలు, కేంద్ర మంత్రులుగా రాణించి పేరు సంపాదించుకున్న ఉదంతాలున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో పేరున్న ప్రాంతీయ పార్టీల అధినేతల కుమారులు తొలుత ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసి ఆ తరువాత కొందరు తమతమ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఫరూక్ అబ్దుల్లా కుమారుడు - జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తొలుత ఎంపీ - కేంద్ర మంత్రిగా పనిచేశాకే ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. అలాగే ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ కూడా యూపీ సీఎం కావడానికి ముందు ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా మాధవరావు సింథియా - రాజేశ్ పైలట్ ల కుమారులు జ్యోతిరాదిత్య - సచిన్ లు కూడా ఎంపీలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే... దక్షిణాదిలో ఆ ధోరణి తక్కువే అయినా లోకేశ్ ను ఆ దారిలో నడిపించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.