Begin typing your search above and press return to search.

కొడాలి నాని వర్సెస్ లోకేశ్

By:  Tupaki Desk   |   2 Oct 2015 11:10 AM GMT
కొడాలి నాని వర్సెస్ లోకేశ్
X
చిన్నవిగా కనిపించిఏ కొన్నికొన్ని విషయాలు వెనుక పెద్ద కథలుంటాయి.. రాజకీయాల్లో అయితే మరీ ఎక్కువ. తాజాగా ఏపీలో అలాంటిదే ఒకటి కనిపిస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడ అంటే తెలుగుదేశానికి కంచుకోట... అక్కడ ఆ పార్టీకి తిరుగేలేదు... కానీ, అక్కడ టీడీపీ నుంచి పలుమార్లు గెలిచిన కొడాలి నాని మొన్నటి ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో సీనంతా మారిపోయింది. కంచుకోట శత్రువు చేతిలోకి వెళ్లిపోయింది... వైసీపీ అక్కడ పాగా వేసింది. వైసీపీ బలం కంటే అక్కడ నాని బలం ఎక్కువ కావడంతో ఆ పార్టీ నుంచి కొడాలి నాని గెలిచేశారు... దీంతో టీడీపీ కంగుతినాల్సివచ్చింది. దాంతో నానిని వచ్చే ఎన్నికల నాటికైనా ఎదుర్కొని మళ్లీ అక్కడ టీడీపీని పునఃప్రతిష్ఠించాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నా ఇంతవరకు పెద్దగా ఫలితం కనిపించడం లేదు.. నాని జోరు ముందు అక్కడ టీడీపీ లేవలేకపోతోంది. దీంతో స్వయంగా చంద్రబాబు తనయుడు లోకేశే రంగంలోకి దిగుతున్నారిప్పుడు. అందులో భాగంగానే తమ తాత ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరును ఆయన దత్తత తీసుకున్నారు. తాతగారి ఊరు కాబట్టి దత్తత తీసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆ ఊరుతో మొదలుపెట్టి గుడివాడను గ్రిప్ చేయాలన్నదే లోకేశ్ వ్యూహమని తెలుస్తోంది.

నిమ్మకూరును దత్తత తీసుకున్న లోకేశ్ నెలకోసారి ఆ ఊరు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.. నాని కారణంగా కంచుకోట గుడివాడను కోల్పోయామని బాగా ఫీలవుతున్న లోకేశ్ ఇప్పుడు నిమ్మకూరుతో మొదలుపెట్టి గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం చేయడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. అందుకు దీర్ఘకాలిక వ్యూహాలు రచిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలితమిస్తాయో ఇప్పుడే చెప్పలేం కానీ కొడాలి నాని మాత్రం లోకేశ్ ప్లానును పసిగట్టేశారు. ''లోకేశ్ మనల్నే టార్గెట్ చేశాడు'' అని నాని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. ర్యాపిడ్ స్టెప్స్ వేయడం... దూకుడుతనంలో ముందుండే నాని లోకేశ్ ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మరోవైపు.... గుడివాడలో టీడీపీని బలోపేతం చేసి అక్కడ ఎవరినైనా అభ్యర్థిగా నిలిపి గెలిపిస్తారో లేదంటే లోకేశే నేరుగా నానితో తలపడతారో చూడాలి. ఏదైనా వచ్చే ఎన్నికల్లో మాత్రం గుడివాడలో బిగ్ ఫైట్ ఖాయమని తేలిపోయింది.