Begin typing your search above and press return to search.

నామినేటెడ్ పదవులన్నీ లోకేశ్ చేతిలోనే..

By:  Tupaki Desk   |   2 Jan 2016 9:14 AM GMT
నామినేటెడ్ పదవులన్నీ లోకేశ్ చేతిలోనే..
X
టీడీపీలో నిన్నమొన్నటి వరకు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా ఉన్న లోకేశ్ ఇప్పుడు సీనియర్ నేతలను కూడా తన వద్దకు రప్పించుకునే స్థాయికి ఎదిగారు. దీనికి కారణం పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతిలో ఉండడమే.

ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల పంపిణీ బాధ్యతను చంద్రబాబు ఆయనకే అప్పగించడంతో ఆశావహులంతా లోకేశ్ వద్దకు క్యూ కడుతున్నారు. ఆయన్ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు వద్ద ఓకే చేసుకున్నా కూడా లోకేశ్ ఓకే అనకపోతే పని జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. అందుకే ముందే లోకేశ్ బాబును ప్రసన్నం చేసుకుని తరువాత చంద్రబాబును కలవడానికి వెళ్తున్నారు నేతలంతా. అయితే... లోకేశ్ కూడా కేవలం తనను కలిసినవారికి.. తనకు నచ్చినవారికి కాకుండా నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీకోసం పనిచేసిన సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ కోసం బాగా కష్టపడ్డా కూడా ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఓడిపోయిన నేతలు, లేదంటే చాలా ఏళ్లుగా పార్టీలో ఉంటూ పదవులు దక్కని వారిని లోకేష్ ఎంపిక చేస్తున్నారు. దీంతో టీడీపీ కోసం కష్టించి పనిచేసిన చాలామంది తమకు న్యాయం జరుగుతుందంటూ లోకేశ్ పై నమ్మకం పెట్టుకుంటున్నారు. కరణం బలరాంకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకోవడం లోకేశ్ నిర్ణయమేనని... సీనియర్లకు ఆయన ప్రాధాన్యమిస్తున్నారనడానికి అదే నిదర్శనమని చెప్తున్నారు.

లోకేశ్ చేతిలో నామినేటెడ్ పదవుల బాధ్యతలు పెట్టడంతో తొలుత చాలామంది భజనపరులకే అవకాశమిస్తారని భావించారు.. కానీ, లోకేశ్ సీనియర్లకు ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలియడంతో వారిలో సంతోషం వ్యక్తమవుతోంది. నన్నపనేని రాజకుమారి - శోభాహైమావతి - సత్యవాణి - కర్నూలు జిల్లా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు - చిక్కాల రాచంద్రరావు - చంద్రదండు ప్రకాష్ నాయుడు - మాజీ మంత్రి పుష్పరాజ్ - ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వంటి నాయకుల పేర్లు లోకేశ్ పరిశీలనలో ఉన్నాయట.