Begin typing your search above and press return to search.

భారత్ లో తొలిసారి ప్రముఖుడ్ని కాటేసిన కరోనా!

By:  Tupaki Desk   |   3 May 2020 5:50 AM GMT
భారత్ లో తొలిసారి ప్రముఖుడ్ని కాటేసిన కరోనా!
X
చిన్నా పెద్దా అన్న తేడా లేదు. పేద సంపన్నుడన్న భేదభావం లేదు. ఆ మాటకు వస్తే.. రాజునైనా కూలీనైనా ఎలాంటి మొహమాటం లేకుండా కౌగిలించేసుకొని.. వారి ప్రాణాల్ని ఇట్టే తీసేయటం కరోనా వైరస్ కు అలవాటే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా కోరలకు చిక్కి బలయ్యారు. లక్కీగా భారత్ లో అలాంటి విషాదం చోటు చేసుకోలేదు.

తాజాగా ఒక ప్రముఖుడి ప్రాణాల్ని కరోనా కబళించేసింది. లోక్ పాల్ సభ్యుడు.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి కరోనా కారణంగా మరణించారు. 62 ఏళ్ల ఆయన ఏప్రిల్ రెండు నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. మూడు రోజులుగా పరిస్థితి విషమించటంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

అదే సమయంలో ఆయన కుమార్తెకు.. ఇంట్లో పని చేసే పనిమనిషికి కరోనా సోకింది. అయితే.. వారిద్దరూ కోలుకున్నారు. తాజాగా ఆయన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండటంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేశారు. అయినప్పటికీ.. ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయారు.

చత్తీస్ గఢ్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఆ మధ్యన పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం లోక్ పాల్ అవినీతి వ్యతిరేక విభాగంలోని నలుగురు న్యాయ సభ్యుల్లో ఒకరుగా అజయ్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశంలో ఒక ప్రముఖుడు కరోనా కారణంగా మరణించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.