Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. బాలయ్య పోరుబాట!

By:  Tupaki Desk   |   4 Feb 2022 10:39 AM GMT
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. బాలయ్య పోరుబాట!
X
ఏపీలో కొత్త జిల్లాల ఉద్యమం మొదలైంది. హిందూపూరం జిల్లా కోసం అక్కడి ప్రజలు పోరుబాట పట్టారు. వారికి మద్దతుగా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ అగ్రహీరో బాలయ్య నిలబడ్డారు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. హిందూపురం జిల్లా కోసం బాలయ్య మౌన దీక్ష, ర్యాలీలు, ఆందోళనల్లో పాల్గొని హీటెక్కించారు. అంతేకాదు.. ఏకంగా హిందూపురం జిల్లా కోసం రాజీనామాకు సిద్ధపడ్డారు. దమ్ముంటే దీనిపై రెఫరెండంగా తనపై పోటీచేసి గెలవాలని వైసీపీకి సవాల్ చేశారు. దీంతో ఈ ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది.

జగన్ సర్కార్ ఇటీవల అనంతపురం జిల్లాను విభజించి పుట్టపర్తి కేంద్రంగా ‘శ్రీసత్యసాయి’ జిల్లాను ప్రకటించింది. దీంతో హిందూపురం భగ్గుమంది. ప్రజలు హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఆందోళనలు మొదలుపెట్టారు. తాజాగా బాలయ్య రంగంలోకి దీన్ని మరింత పతాకస్థాయికి తీసుకెళ్లారు.

తాజాగా హిందూపురంలో కొత్త జిల్లాల ఆందోళనల్లో పాల్గొన్న బాలయ్య పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. దీక్షా స్థలానికి బాలయ్య అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా చేరుకున్నారు.

బాలయ్య తరలిరావడంతో హిందూపురంలో పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాలంటూ బాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. బాలకృష్ణ వెంట అఖిలపక్ష సభ్యులు, విద్యార్థులు, యువకులు తరలివచ్చారు.

ఈ క్రమంలోనే ఈ ఉద్యమాన్ని మరింత పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు ఉద్యమ కార్యాచరణపై బాలయ్య అఖిలపక్షం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు బాలకృష్ణ నివాసం వద్ద కార్యకర్తలు, నాయకులు అభిమానుల తాకిడీతో సందడి వాతావరణం నెలకొంది.

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బాలయ్య సంచలన ప్రకటన చేశారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. దీంతో ఈ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. ఏపీలో ఇప్పటికే పలు కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాల లొల్లి మొదలైంది. హిందూపురం కోసం తాజాగా ప్రజలు పతాకస్థాయిలో రోడ్డెక్కారు. ఇంకా మరికొన్ని చోట్ల కూడా జిల్లాల రగడ కొనసాగుతోంది.