Begin typing your search above and press return to search.

లండన్ కోర్టులో మాల్యాకు షాక్... వాట్ నెక్ట్స్?

By:  Tupaki Desk   |   20 April 2020 4:30 PM GMT
లండన్ కోర్టులో మాల్యాకు షాక్... వాట్ నెక్ట్స్?
X
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా 16 బ్యాంకులను నట్టేట ముంచేసి... రూ.9 వేల కోట్ల రుణాలను ఎగవేసి ఎంచక్కా బ్రిటన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు నిజంగానే సోమవారం భారీ షాక్ తగిలింది. ఇప్పటికే విల్ ఫుల్ డిఫార్టర్(ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు)గా ముద్ర వేయించుకున్న మాల్యా... తాను తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లిస్తానని చెబుతున్నా... భారత్ కు వచ్చి కోర్టుల్లో విచారణ ఎదుర్కొనేందుకు మాత్రం సిద్ధపడటం లేదు. ఈ క్రమంలో తనను భారత్ కు అప్పగించేందుకు అనుకూలంగా 2018 లో ఇచ్చిన తీర్పును సవరించేందుకు లండన్ కోర్టు సోమవారం ససేమిరా అన్నది. ఈ మేరకు సదరు తీర్పును సవరించాలంటూ మాల్యా దాఖలు చేసుకున్న పిటిషన్ ను లార్డ్ జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్ - జస్టిస్ ఎలిజబెత్ లాంగ్ లతో కూడిన ఇద్దరు సభ్యుల రాయల్ కోర్టు ధర్మాసనం కొట్టి వేసింది.

భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు సుమారు 9,000 కోట్ల రూపాయలకు పైగా ఎగవేసిన - మాల్యా 2016 మార్చిలో లండన్ పారిపోయాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసిన ఈడీ - సీబీఐ చార్జ్ షీట్లను దాఖలు చేశాయి. మాల్యాకు చెందిన ఆస్తులను ఇప్పటికే ఎటాచ్ చేశాయి. మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం.... విచారణనిమిత్తం అతణ్ని ఇండియాకు తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ వాదనను సమర్థించిన బ్రిటన్ పోలీసుల సహకారంతో 2017 ఏప్రిల్‌ లో మాల్యాను లండన్‌ లో భారత అధికారులు అరెస్టు చేశారు. అయితే తర్వాత బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే 2018 డిసెంబర్‌ లోనే విజయ్ మాల్యాను అప్పగించాలని లండన్ కోర్టు ఆదేశించింది.

అయినా కూడా మాల్యా తనదైన శైలి పోరాటం సాగిస్తూ... సదరు తీర్పును నిలువరించేందుకు నానా పాట్లూ పడుతున్నారు. తనను భారత్ కు అప్పగించేందుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును నిలువరించాలని ఇప్పుడు ఆయన చేస్తున్న పోరాటం... తాజా తీర్పుతో ముగిసిందనే చెప్పాలి. అయితే... మాల్యాను భారత్ కు అప్పగించేందుకు అనుకూలంగా లండన్ కోర్టు 2018లోనే తీర్పు ఇచ్చినా... ఇప్పటిదాకా ఆ దిశగా అసలు ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా మాల్యా పిటిషన్ ను అక్కడి కోర్టు కొట్టివేసినా... మాల్యాను భారత్ కు రప్పించేందుకు ఎప్పటికి సాద్యపడుతుందో చూడాలి. అసలు లండన్ కోర్టు తీర్పు వచ్చినా కూడా మాల్యాను భారత్ కు తీసుకురావడం సాధ్యపడుతుందో? లేదో? కూడా చూడాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.