Begin typing your search above and press return to search.

అప్పులు చెల్లించ‌క‌పోతే జైలుకే: అనిల్ అంబానీకి లండ‌న్ కోర్టు హెచ్చ‌రిక‌!

By:  Tupaki Desk   |   4 July 2020 12:30 AM GMT
అప్పులు చెల్లించ‌క‌పోతే జైలుకే: అనిల్ అంబానీకి లండ‌న్ కోర్టు హెచ్చ‌రిక‌!
X
భార‌త దిగ్గ‌జ‌ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి క‌ష్టాల మీద క‌ష్టాలు వ‌స్తున్నాయి. తన వ్యాపారం దివాళా తీసి ఉండ‌గా అత‌డు చేసిన అప్పులు అత‌డికి ఉచ్చుగా మారాయి. దీంతో అత‌డు కేసులతో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. తాజాగా అనిల్ అంబానీకి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించడం లేదంటూ చైనా బ్యాంకులు వేసిన పిటిషన్‌ పై విచారణ చేసిన కోర్టు బాకీలు చెల్లించాల‌ని.. లేక‌పోతే జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. దీనికి ఈ నెల 20వ తేదీలోపు ఆదాయ, వ్యయాల వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని చెప్పింది. లేదంటే ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపిస్తామంటూ ఆల్టిమేటం జారీ చేసింది. లక్ష డాలర్లకు పైగా విలువ ఉన్న అన్ని ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది.

అనిల్ అంబానీ తమకు 717 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ.5,354 కోట్లు విలువైన బాకీలను చెల్లించడం లేదంటూ చైనాకు చెందిన మూడు బ్యాంకులు లండన్ లోని మాస్టర్ డేవిసన్ కమర్షియల్ కోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. అయితే దీని విష‌యంలో అనిల్ అంబానీ వివ‌ర‌ణ ఇచ్చినా కోర్టు సంతృప్తి వ్య‌క్తం చేయ‌లేదు. దీనిపై విచారణ కొన‌సాగుతోంది. తాజాగా కోర్టు అనిల్ అంబానీకి ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల‌కు రుణపడి ఉన్న అప్పులను చెల్లించాలంటూ ఈ ఏడాది మే నెలలోనే జస్టిస్ నిగెల్ టియర్ తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆర్‌‌కామ్ కోసం అంబానీ పర్సనల్ గ్యారంటీ ఇచ్చి, 900 మిలియన్ డాలర్ల అప్పు తీసుకున్నారని బ్యాంకులు ఆరోపించగా బాకీ చెల్లించే స్తోమత లేదని త‌న‌కు లేద‌ని అనిల్ అంబానీ వాపోతున్న విష‌యం మ‌నం చూస్తునే ఉన్నాం. తాజాగా లండ‌న్ కోర్టు ఆదేశాల‌తో అనిల్ అంబానీ ఏం చేయాలో తెలియ‌క కుదేల‌వుతున్నాడు. ఒక‌ప్పుడు రాజాలా బ‌తికిన అనిల్ అంబానీ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప‌రిస్థితి.