Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప ఎన్నికను టీ20 ఫార్మాట్ లో చూస్తే..

By:  Tupaki Desk   |   3 Nov 2021 10:30 AM GMT
హుజూరాబాద్ ఉప ఎన్నికను టీ20 ఫార్మాట్ లో చూస్తే..
X
ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న వేళ.. అందరి చూపు క్రికెట్ మీద ఉంది. ఐపీఎల్ లో ఇరగదీస్తున్న మనోళ్లు.. పొట్టి ప్రపంచకప్ వేళ మాత్రం దారుణమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. ఇదే వేళలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికను క్రికెట్ కు అన్వయించి చూసినప్పుడు ఆసక్తికరమైన సీన్ కనిపిస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి వివిధ పార్టీలు.. వాటి అధినేతలు.. బాధ్యుల్ని క్రికెట్ పరిభాషలో చూసినప్పుడు ఎలా ఉంటుందన్న దాన్ని చూస్తే..

- కేసీఆర్: గులాబీ జట్టు యజమాని. అనూహ్య విజయంతో ప్రత్యర్థిని తొక్కేయటమే కాదు.. సొంత పార్టీలోని నేతల నోళ్లను మూద్దామనుకున్న ఆయన కోరిక తీరటం సరికదా. డబ్బు పోయే.. శని పట్టే అన్న రీతిలో మారింది. పేరున్న ఆటగాళ్లను ఖర్చుకు వెనకాడకుండా కొనేసి ఐపీఎల్ జట్టు తయారు చేశాక.. దారుణంగా ఫెయిల్ అయితే ఎలాంటి పరిస్థితి ఉందో తాజాగా ఆయన పరిస్థితి అలానే ఉంది.

- కేటీఆర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాన్ని సాధించటం ద్వారా యువరాజుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఎవరైనా సరే.. వారి ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియజెప్పాలన్న దానికి నిదర్శనంగా ఈటల ఎపిసోడ్ చోటు చేసుకుంది. దీంతో.. గులాబీ జట్టుకు కానున్న యజమాని ఎవరన్న దానిపై పూర్తి స్థాయి క్లారిటీతో పాటు.. నచ్చినా నచ్చకున్నా సరే.. యువరాజును ఓకే అనాల్సిందే అన్న దానికి కర్రకాల్చి వాత పెట్టిన రీతిలో హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటమే కాదు.. ఫ్యూచర్ మీద కొత్త టెన్షన్ పట్టేలా చేసింది.

- హరీశ్: హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ గులాబీ జట్టుకు కెప్టెన్ గా చేసి.. నువ్వు గ్రౌండ్ లో చెలరేగిపో.. మైదానం బయట మేం చూసుకుంటామన్న మేనమామకు మించిన డ్యామేజీ ఆయన సొంతమైంది. గెలుపు ఖాయమన్న ధీమాతో చెలరేగిపోయిన ఆయన.. చిరకాల సన్నిహితుడి మీద ఇంతలా విరుచుకుపడటమా? అన్న కొత్త అపప్రదను మూటగట్టుకున్న పరిస్థితి.

- ఈటల: మొన్నటి వరకు గులాబీ జట్టులో ఉండి.. ఈ మధ్యనే కమలం జట్టులోకి వచ్చిన ఆయన తన వ్యక్తిగత సత్తాతో విజయాన్ని సొంతం చేసుకోవటం ద్వారా మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ గా మారారు. గులాబీ జట్టు వేసిన ఎత్తుల్ని చిత్తు చేయటమే కాదు.. భారీ ఎత్తున డబ్బు సంచుల్ని విప్పినా.. ఏ మాత్రం తొణక్కుండా ఎన్నికల రణరంగంలో పోరాడిన పోరాటానికి మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ ను సొంతం చేసుకున్నారు.

- పాడి కౌశిక్ రెడ్డి: ఒక్క తప్పు చాలు ఆట మాత్రమే కాదు ఆటగాడి ఫ్యూచర్ సైతం మటాష్ అవుతుందనటానికి నిదర్శనంగా మారారు. పదవీ కాంక్షతో పార్టీ మారకుండా.. కాంగ్రెస్ జట్టు నుంచి బరిలోకి దిగి ఉంటే గెలవకున్నా.. తనకున్న వ్యక్తిగత ఛరిష్మా ఏ స్థాయిలో అన్న విషయంపై క్లారిటీ రావటమే కాదు.. రానున్న ఎన్నికల్లో చక్కటి అవకాశం లభించేది. ఎమ్మెల్యే పదవి వస్తుందన్న ఆశతో జట్టు మారిన ఆయన ఇప్పుడు త్రిశంక స్వర్గంలో వేలాడుతున్న పరిస్థితి.

- గెల్లు శ్రీనివాస్ యాదవ్: విద్యార్థి నాయకుడిగా పేరున్నప్పటికి ఈటల మీద పోటీ చేయటం వరకు బాగానే ఉన్నా.. ఆయన స్థాయికి ఏ మాత్రం సూట్ కానప్పటికీ.. ఘాటు వ్యాఖ్యలు చేయటం ద్వారా మొదటికే మోసం తెచ్చుకోవటమే కాదు..గులాబీ జట్టు నుంచి బరిలోకి దిగిన మొదటి మ్యాచ్ లోనే డకౌట్ అయిన దుస్థితిలో ఆయన ఉన్నారు.

- బండి సంజయ్: సుడి అంటే సుడి ఆయనదే. హుజురాబాద్ మ్యాచ్ లో గులాబీ జట్టు మీద కాషాయ జట్టు ఆడిన కీలక మ్యాచ్ లో జట్టు సహ యజమాని పాత్రను పోషించినప్పటికీ.. ఈటల గెలుపును తన ఖాతాలోకి మళ్లించుకున్నప్పటికీ.. తన దర్శకత్వ పర్యవేక్షణలోనే విజయం సాధించిందన్న క్రెడిట్ ను సొంతం చేసుకునే అవకాశం ఆయన సొంతమైంది.

- రేవంత్: కాంగ్రెస్ జట్టుకు సహ యజమాని పాత్రను పోషించి.. వ్యూహాత్మక ఎత్తుగడతో వ్యవహరించినప్పటికీ.. పేలవమైన స్కోర్ (ఓట్లు) కొత్త ఆరోపణలకు.. విమర్శలకు తావిచ్చారు. సొంత జట్టులోని వారి చేత మాటలు అనిపించే అవకాశాన్ని ఇచ్చారు.

- బల్మూరి వెంటక్: కాంగ్రెస్ పార్టీ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ తన పేలవమైన ఆటతో పరువు పోగొట్టుకోవటమే కాదు.. ఎక్స్ ట్రా ప్లేయర్ గా నిలిచిపోయారు. భవిష్యత్తులో ఆడే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.