Begin typing your search above and press return to search.
లాలూ మాట!... బీజేపీని రాముడే శిక్షిస్తాడు!
By: Tupaki Desk | 20 Oct 2017 12:54 PM GMTపంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే బీహార్ మాజీ సీఎం - ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్... నోరు తెరిచారంటే అవతలి పక్షం నోరు మూసుకోవాల్సిందే. అసలు లాలూ విసిరే పంచ్ లకు అంతే స్పాంటేనియస్ గా పంచ్ లు విసరగలిగే నేతలు దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే అటు బీహార్ సీఎంగానే కాకుండా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగానూ తనదైన రీతిలో పాలన సాగించి ప్రశంసలు అందుకున్న లాలూ... ఆ తర్వాత దాణా స్కాంలో ఇరుక్కుని ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపుగా దూరమయ్యారనే చెప్పాలి. నేను లేకపోతేనేం... నా వారసులు ఉన్నారంటూ గొప్పగా ప్రకటనలు గుప్పించిన లాలూ... గడచిన బీహార్ ఎన్నికల్లో తన ఇద్దరు పుత్ర రత్నాలను రంగంలోకి దించేశారు. అధికార జేడీయూతో జట్టుకట్టి మరీ రణరంగంలోకి దిగిన లాలూ... నితీశ్ ను మరోమారు సీఎం పదవిని ఎక్కించడమే కాకుండా... తన ఇద్దరు కుమారులను కూడా నితీశ్ కేబినెట్ లో చేర్పించేశారు.
అయితే చేసిన పాపాలు ఊరికే పోవన్న సామెత మాదిరిగా రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ లాలూ చేసిన అవినీతిని తిరగదోడిన దర్యాప్తు సంస్థలు ఇప్పుడు లాలూతో పాటు ఆయన మొత్తం కుటుంబ సభ్యులను కూడా ముప్పుతిప్పలు పెట్టేస్తున్నాయి. ఫలితంగా నితీశ్ కేబినెట్ నుంచి లాలూ పుత్రరత్నాలు వైదొలగక తప్పలేదు. నితీశ్ ను తమకు దూరం చేయడం, తన ఇద్దరు కొడుకులను కేబినెట్ నుంచి వైదొలగేలా చేయడం... అంతా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పనేనన్నది లాలూ భావన. ఈ దిశగా ఇప్పటికే లాలూ బీజేపీపై నిప్పులు చెరిగేశారు. తాజాగా మరోమారు ఆయన బీజేపీపై ఘాటు వ్యాఖ్యలతో కూడిన విమర్శలు సంధించారు.
దేశంలో ఎన్నికల వచ్చిన ప్రతిసారి బీజేపీ శ్రీరాముడి పేరును వాడుకుంటోందని విమర్శించిన లాలూ.. ఈ దఫా తన పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీని రాముడే శిక్షిస్తాడని అన్నారు. రాజకీయాల కోసం భగవంతుడైన శ్రీరాముడి పేరును వాడుకోవడం అత్యంత దారుణమని ఆయన విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రీరాముడి పేరుతో రాజకీయ నాటకాన్ని రక్తికట్టిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ప్రతి వ్యక్తికి తమ మతాన్ని, మతాచారాలను పాటించే హక్కు ఉందని చెప్పిన లాలూ... అందుకోసం డ్రామాలు అడాల్సిన అవసరం లేదని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ సరయూ నది ఒడ్డున పొలిటికల్ డ్రామా చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడుతున్న ఈ డ్రామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతారని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు.