Begin typing your search above and press return to search.

నిమిషానికి రూ.2259 కోట్ల నష్టం.. 2 రోజుల్లో రూ.12.38 లక్షల కోట్లు మటాష్

By:  Tupaki Desk   |   15 Feb 2022 3:15 AM GMT
నిమిషానికి రూ.2259 కోట్ల నష్టం.. 2 రోజుల్లో రూ.12.38 లక్షల కోట్లు మటాష్
X
తుమ్మితే ముక్కు ఊడిపోయేలా ఉండే స్టాక్ మార్కెట్ చాలా చిన్న విషయాలకే ఇట్టే స్పందిస్తుందన్న సంగతి తెలిసిందే. అలాంటిది యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్ ను దారుణంగా దెబ్బ తీయటంతో పాటు.. చమురు ధరలు భారీగా నమోదైన పరిస్థితి. ఈ మొత్తం పరిణామాలు ప్రపంచంలోని పలు స్టాక్ మార్కెట్లమీద ప్రభావం చూపిస్తే.. మన స్టాక్ మార్కెట్ సైతం తీవ్ర ఒడిదుకులకు లోనైంది. మార్కెట్లు మొత్తం కుప్పకూలిపోయాయి.

ఈ నష్ట తీవ్రత రూపాయిల్లో చూస్తే కానీ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ ఏడాదిలో ఒకరోజు అత్యంత భారీ నష్టాన్నినమోదయ్యేలా చేసింది. నిఫ్టీ కీలక 17000 స్థాయిని కోల్పోవటంతో నష్టం భారీగా నమోదైంది. అదెంత అంటే.. నిమిషానికి రూ.2259 కోట్ల చొప్పున మార్కెట్ సంపద కంటికి కనిపించని రీతిలో ఆవిరైపోయింది. ఇంత భారీ నష్టం 2021 ఫిబ్రవరి 26తర్వాత ఇదేనని చెబుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో సెన్సెక్స్ 2520.10పాయింట్లను పోగొట్టుకుంది.

ఈ మొత్తం పరిణామంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల విలువ సోమవారం ఒక్కరోజులోనే రూ.8.47 లక్షల కోట్లు ఆవిరైంది. దీంతో.. మొత్తం విలువ రూ.2.55కోట్ల కోట్లకు పరిమితైంది. మొత్తంగా రెండు రోజుల వ్యవధిలో మార్కెట్ లో స్టాక్ విలువ రూ.12.38 లక్షల కోట్ల సంపద ఆవిరైన పరిస్థితి. ఇంత భారీ నష్టానికి కారణాల్ని చూస్తే..

- తాజాగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలు మొహరించటంతో మదుపరులలో భయాలు పెరిగాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సూచీలు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి.

- యుద్ధం అనివార్యమైతే ముడిచమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయన్న కారణాలుఅంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్ బ్యారెల్ ధర 95.44 డాలర్లకు చేరుకుంది.

- అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవటం.. ఆ దేశ కేంద్ర బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను అనుకున్న దాని కంటే ఎక్కువగా పెంచుతుందన్న సందేహాలు అమ్మకాల ఒత్తిడికి కారణమైంది.

- బీఎస్ఈలో ప్రతి ఐదు షేర్లను నాలుగు షేర్లు నష్టపోయాయి.

- 570 షేర్లు లోయర్ సర్క్యుట్ ను తాకాయి

- బీఎస్ఈలోని 19 రంగాలకు చెందిన సూచీలు కుదేలయ్యాయి.