Begin typing your search above and press return to search.

బోలెడంత మంది వారసుల్ని గెలిపించేశారు

By:  Tupaki Desk   |   25 Oct 2019 6:49 AM GMT
బోలెడంత మంది వారసుల్ని గెలిపించేశారు
X
మహారాష్ట్ర ఎన్నికల్లో ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయని చెప్పాలి. కొద్ది నెలల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. సార్వత్రిక ఎన్నికల్లోనూ పలువురు సీనియర్ రాజకీయ నేతల వారసులు ఎన్నికల బరిలో దిగారు. అలాంటివారిలో ఎక్కువమంది టీడీపీ తరఫున పోటీ చేసినోళ్లే. తమ వారసుల్నిబరిలో దింపుతూ.. తమ రాజకీయ వారసత్వాన్ని వారికి ఇవ్వాలని తపించిన సీనిరయర్లకు షాకిచ్చారు ఏపీ ఓటర్లు.

పెద్ద ఎత్తున తమ వారసుల్ని తొలిసారి దించిన తెలుగు తమ్ముళ్లకు ఎదురుదెబ్బలు తగిలితే.. దీనికి భిన్నమైన సీన్ తాజాగా వెల్లడైన మహారాష్ట్ర ఎన్నికల్లో కనిపించటం విశేషం. దేశంలో వారసత్వ రాజకీయాలకు ప్రజలు పాజిటివ్ గా రియాక్ట్ కావటం లేదన్న మాట వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా మహారాష్ట్ర ఫలితాలు వెల్లడయ్యాయని చెప్పాలి.

శివసేన పార్టీని పెట్టినప్పటికీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని బాల్ ఠాక్రే కుటుంబానికి ఉన్న అలవాటును బ్రేక్ చేసిన ఆదిత్య ఠాక్రే ఏకంగా 70వేల మెజార్టీతో ఎన్నిక కావటమే కాదు.. అన్ని కలిసి వస్తే సీఎం అయినా ఆశ్చర్యపోలేని పరిస్థితి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారులు అజిత్.. ధీరజ్ లు కూడా లాతూరు జిల్లా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ సోదరుల్లో ఒకరైన ధీరజ్ లాతూర్ గ్రామీణ ప్రాంతం నుంచి బరిలోకి దిగి ఏకంగా 1.20లక్షల మెజార్టీని సొంతం చేసుకోవటం గమనార్హం.

మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతి షిండే తో పాటు..మరో మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే కుమారుడు నితేష్ రాణేలతో పాటు.. పలువురు రాజకీయ నేతల వారసులు తాజా ఎన్నికల్లో గెలుపొంది మహారాష్ట్ర అసెంబ్లీలోకి అడుగు పెడుతుండటం విశేషం.