Begin typing your search above and press return to search.

ఏపీలో లాట‌రీ ఎమ్మెల్యేల ప‌నైపోయిందా..!

By:  Tupaki Desk   |   2 Feb 2022 9:30 AM GMT
ఏపీలో లాట‌రీ ఎమ్మెల్యేల ప‌నైపోయిందా..!
X
ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు అధికారికంగానే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది ముక్కూ మొఖం తెలియ‌ని వాళ్ల‌కు కూడా జ‌గ‌న్ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వ‌డం.. వాళ్లంతా జ‌గ‌న్ వేవ్‌లో ఎమ్మెల్యేలు అయిపోవ‌డం జ‌రిగిపోయాయి. రియ‌ల్ ఎస్టేట్ చేసుకునేవాళ్లు... ఇళ్ల‌లో ఎలాంటి ప‌ని లేకుండా ఉన్న‌వాళ్లు... హైదారాబాద్‌, బెంగ‌ళూరులో చిన్నా చిత‌కా రియ‌ల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ల‌ను కూడా జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌ను చేసేశారు. అసలు వీరిలో చాలా మందికి ప్ర‌జ‌ల‌తో ప‌రిచ‌యాలు లేవు.. అస‌లు ప్ర‌జ‌ల్లోకి ఎలా ? వెళ్లాలి.. వారి అడిగిన ప‌నులు ఏ ప్రాధాన్య‌త‌లో చేసిపెట్టాలో కూడా తెలియ‌దు.

చివ‌ర‌కు వార్డు కౌన్సెల‌ర్లుగా ఓడిపోయిన వాళ్ల‌ను ఎమ్మెల్యేల‌ను చేయ‌డ‌మే కాదు.. ఏకంగా మంత్రులు అయిపోయారు. ఇంత‌క‌న్నా విచిత్రం మ‌రొక‌టి ఉండ‌దేమో ? ఇక తాము జీవితంలో ఎమ్మెల్యేలం అవుతామా ? అన్న సందేహాలు ఉన్న వారు ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న 151 మంది ఎమ్మెల్యేల‌లో 70 మంది ఎమ్మెల్యేలు రాజ‌కీయాల‌కు కొత్త‌. అందుకే వీరు ఎమ్మెల్యేగా గెలిచాక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎలా అందుబాటులో ఉండాలో తెలియ‌క కొంద‌రు.. అస‌లు ప్ర‌జ‌ల‌ను.. అధికారుల‌ను ఎలా డీల్ చేయాలో తెలియ‌క మ‌రికొంద‌రు త‌మ ప‌ద‌వికి ఉన్న క్రేజ్ అంతా తీసేస్తున్నారు.

మ‌రి కొంద‌రం ఎమ్మెల్యేలం అన్న హోదాను ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు. మ‌ళ్లీ టిక్కెట్ వ‌స్తుందో ? రాదో ? గెలుస్తామో ? లేదో ? తెలియ‌దు.. ఉన్న‌న్ని రోజులు నాలుగు రాళ్లు వెన‌కేసుకుందాము... ఈ ప‌ద‌విని ఎంజాయ్ చేద్దాం అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌ట‌కీ ఓ 50 మంది ఎమ్మెల్యేల‌కు ఈ రెండున్న‌రేళ్ల‌లో సీఎం జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ లేదు. ఒక‌టి రెండు సార్లు వ‌చ్చినా అస‌లు సీఎం, మంత్రుల ద‌గ్గ‌ర నుంచి నిధులు ఎలా రాబ‌ట్టుకోవాలో ? నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు ఎలా ? చేయించుకోవాలో కూడా తెలియ‌ని దుస్థితి.

మరోవైపు నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌ను న‌మ్ముకున్న పార్టీ కేడ‌ర్‌కు న్యాయం చేయ‌లేక‌.. అటు చిన్న చిన్న ప‌నులు కూడా చేయ‌లేక మొఖం ఎలా చూపించుకోవాలో తెలియ‌క విల‌విల్లాడుతున్నారు. కొత్త ఎమ్మెల్యేల్లో చాలా మంది హైద‌రాబాద్‌, బెంగ‌ళూరులో త‌మ వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు.

వీరంతా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ్వ‌రికి ట‌చ్‌లో ఉండ‌డం లేదు. అస‌లు ఫోన్లే ఎత్త‌డం లేదు. ఏదైనా త‌ప్ప‌నిస‌రి అయితే అధికారుల‌కు ఫోన్లు మాత్ర‌మే చేస్తున్నారు. అసలు అధికారుల మీద కూడా వాళ్ల‌కు గ్రిప్ లేక‌పోవ‌డంతో వారి మాట వినే ప‌రిస్థితే లేద‌ట‌. ఇక ఈ లాట‌రీ ఎమ్మెల్యేల‌ను మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.