Begin typing your search above and press return to search.

ఆస్తుల్లో టాప్: జాతీయ స్థాయిలో బీజేపీ.. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్ వాదీ

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:55 AM GMT
ఆస్తుల్లో టాప్: జాతీయ స్థాయిలో బీజేపీ.. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్ వాదీ
X
అరచేతిలో అధికారాన్ని పెట్టుకొని ప్రజల బతుకుల్ని ప్రభావితం చేసే రాజకీయ పార్టీల ఆర్థిక మూలాలు ఏరీతిలో ఉన్నాయి? ఎవరికి ఎన్ని ఆస్తులున్నాయి? అప్పుల మాటేంటి? మొత్తంగా ఆస్తులు.. అప్పుల విషయంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జాతీయ పార్టీల వర్సెస్ ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే.. ఎవరెలా ఉన్నారు? లాంటి ఎన్నో ప్రశ్నలకు తన తాజా నివేదికతో సమాధానాలు ఇచ్చేసింది అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్. ఈ సంస్థ తయారు చేసిన నివేదికలో ఏడు జాతీయ పార్టీలు.. 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాల్ని సేకరించి..విశ్లేషించింది.

జాతీయ పార్టీల విషయానికి వస్తే ఏడు పార్టీల ఆస్తుల వివరాల్ని సేకరించింది. ఇందులో బీజేపీ తిరుగులేని రీతిలో ఆస్తులు ఉన్నాయి. 2019-20లో తమ ఆస్తుల వివరాల్ని రూ.4847 కోట్లుగా ప్రకటించింది. రెండో స్థానంలో బీఎస్పీ నిలవగా.. దేశాన్ని అత్యధిక కాలం పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. బీఎస్పీకి రూ.693.33 కోట్ల ఆస్తులు ఉంటే.. కాంగ్రెస్ పార్టీకిరూ.588.16 కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే.. విపక్షంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ రూ.563.47 కోట్లతో ముందు వరుసలో ఉండగా.. తర్వాతి స్థానంలో అధికార టీఆర్ఎస్ రూ.301.47 కోట్లు.. మూడో స్థానంలోనూ విపక్ష అన్నాడీఎంకే రూ.267.61 కోట్లతో నిలిచింది. ఇదిలా ఉంటే ఏడు జాతీయ పార్టీల ఆస్తుల మొత్తం రూ.6988.57 కోట్లు అయితే 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు మొత్తం రూ.2219.38 కోట్లుగా ఉండటం గమనార్హం. పార్టీలు ప్రకటించిన ఆస్తుల్లో డిపాజిట్ల విషయానికి వస్తే ఆసక్తికర గణాంకాలు కనిపించాయి.

జాతీయ పార్టీల్లో బీజేపీ రూ.3253 కోట్లు.. బీఎస్పీ రూ.618.86 కోట్లుగా ఉండగా.. ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే.. సమాజ్ వాదీ రూ.434.21 కోట్లు ఉండగా.. టీఆర్ఎస్ రూ.256.01 కోట్లు.. డీఎంకే రూ.162.42 కోట్లు.. శివసేన రూ.148.46 కోట్లు.. బీజేపీ రూ.119.42 కోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక.. రాజకీయ పార్టీల అప్పుల విషయాన్ని చూస్తే.. ఏడు జాతీయ.. 44ప్రాంతీయ పార్టీల అప్పులు రూ.134.93 కోట్లుగా లెక్క తేల్చారు.జాతీయ పార్టీలు రూ.74.27 కోట్ల అప్పుల్ని చూపిస్తే.. అందులో ఒక్క కాంగ్రెస్ పార్టీ అప్పే రూ.49.55 కోట్లుగా ఉంది. ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే 44 పార్టీల అప్పు రూ.60.66 కోట్లు ఉన్నట్లు గుర్తించారు.