Begin typing your search above and press return to search.

ఇంత జ‌రుగుతున్నా ల‌వ్ యూ రాజా.. జాడేది?

By:  Tupaki Desk   |   28 Sep 2022 8:52 AM GMT
ఇంత జ‌రుగుతున్నా ల‌వ్ యూ రాజా.. జాడేది?
X
సినీ రంగంలో వైఎస్సార్సీపీకి గ‌ట్టి మ‌ద్దతుదారుల్లో ఒక‌రు.. పోసాని కృష్ణ‌ముర‌ళి. అలాంటి కృష్ణ‌ముర‌ళి గ‌త కొంత‌కాలంగా యాక్టివ్‌గా లేరు. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి లేదా వైఎస్సార్సీపీకి అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా మీడియా ముందుకొచ్చి పోసాని కృష్ణ‌ముర‌ళి గ‌ట్టి మద్ద‌తుగా నిలిచేవారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై తీవ్రంగా విరుచుకుప‌డేవారు. ప్ర‌స్తుతం ఏపీలో విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్ట‌డంపై ర‌గ‌డ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయినా స‌రే పోసాని కృష్ణ‌ముర‌ళి మీడియా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

గుంటూరు జిల్లాకు చెందిన పోసాని కృష్ణ‌ముర‌ళి క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. అయిన‌ప్ప‌టికీ ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు వైఎస్ జ‌గ‌న్‌కు జైకొట్టారు. చాలా సంద‌ర్భాల్లో జ‌గ‌న్‌కు అనుకూలంగా మీడియా ముందుకొచ్చి పోసాని మ‌ద్దతుగా మాట్లాడారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

అయితే వైఎస్సార్సీపీ గెలిచాక పోసాని కృష్ణ‌ముర‌ళికి ఏదైనా ప‌ద‌వి వ‌స్తుంద‌ని చెప్పుకున్నారు. అయితే ఆయ‌న‌కు ఏ ప‌ద‌వీ రాలేదు. సినిమాల్లో న‌టిస్తూనే వ‌చ్చారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు మీడియా ముందుకొచ్చిన పోసాని కృష్ణ‌ముర‌ళి ఆయ‌న‌పై తీవ్ర వ్య‌క్తిగత విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాకుండా ప‌వ‌న్ మాతృమూర్తిని, స‌తీమ‌ణిని, పిల్ల‌ల‌ను కూడా వ‌దిలిపెట్ట‌కుండా అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించారు. ఈ విష‌యంలో వ‌ర్గాల‌క‌తీతంగా పోసాని మాట‌ల‌పై అభ్యంత‌రం వ్యక్తం చేశారు. చివ‌ర‌కు మెగా ఫ్యామిలీ అంటే ప‌డ‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ కూడా పోసాని మాట‌ల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు సినిమాల్లో అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. వైఎస్సార్సీపీకి మ‌ద్దతుగా నిల‌వ‌డం, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు ఆయ‌న‌కు చేటు చేశాయ‌ని చెబుతారు. మ‌ధ్య‌లో ఒకే ఒక్క‌సారి ఆన్‌లైన్ సినిమా టికెట్ల వ్య‌వ‌హారంలో స్టార్ హీరోలు చిరంజీవి, ప్ర‌భాస్‌, మ‌హేష్ తదిత‌రులు జ‌గ‌న్‌ను క‌లిసిన‌ప్పుడు పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ లాంటి హార్డ్ కోర్ వైసీపీ మ‌ద్దతుదారులు కూడా ఆ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పోసాని జాడ ఇప్ప‌టివ‌ర‌కు లేదు.

ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా, విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా పోసాని కృష్ణ‌ముర‌ళి రాణించారు. ముఖ్యంగా ఐ ల‌వ్ యూ రాజా అనే ఊత‌ప‌దంతో ఆయ‌న బాగా పాపుల‌ర్ అయిపోయారు. 2009 ప్ర‌జారాజ్యం పార్టీలో చేరిన పోసాని గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత రాజకీయాల‌కు విరామం ప్ర‌క‌టించి సినిమాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. గ‌త ఎన్నిక‌ల ముందు వైఎస్సార్సీపీకి గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా మారారు.

ప్ర‌స్తుతం సినిమాలు లేకుండా, రాజ‌కీయాల్లో ఏ ప‌ద‌వీ లేకుండా పోసాని కృష్ణ‌ముర‌ళి రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారయ్యార‌ని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంటోంది. ఈ స‌మ‌యంలో వీలైనంత క‌మ్మ నేత‌లు ఈ అంశంపై జ‌గ‌న్‌కు మ‌ద్దతుగా నిల‌వాల‌ని ఆ పార్టీ భావిస్తోంది. అయితే అనూహ్యంగా పోసాని కృష్ణ‌ముర‌ళి జాడ లేక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.