Begin typing your search above and press return to search.

ఎన్నిక‌లు వ‌స్తే కానీ.. మ‌న‌వాళ్లు త‌లుచుకోరు.. ఇదిగో రుజువు!

By:  Tupaki Desk   |   20 Dec 2022 3:28 AM GMT
ఎన్నిక‌లు వ‌స్తే కానీ.. మ‌న‌వాళ్లు త‌లుచుకోరు.. ఇదిగో రుజువు!
X
పార్టీ ఏదైనా ప్ర‌భుత్వం ఏదైనా ప్ర‌జ‌లు గుర్తుకు రావాలన్నా, వారి స‌మ‌స్య‌లు తెలియాల‌న్నా ఎన్నిక‌లు రావాల్సిందేనా? ఎన్నిక‌లు ఉంటే త‌ప్ప ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకునే నాథుడు ఈ దేశంలో క‌నిపించ‌డం లేదా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా రాజ‌స్థాన్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఈ చ‌ర్చ‌కు మ‌రో సారి తెర‌దీసింది. రాజ‌స్థాన్‌లో వ‌చ్చే ఏడాది చివ‌రిలో ఎన్నిక‌లు ఉన్నాయి. కాంగ్రెస్ పాల‌న‌పై అక్క‌డ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంది.

దీనికి తోడు అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో పార్టీ రోజుకోసారి రోడ్డున పడుతూనే ఉంది. ఇక‌, సంప్ర‌దాయం ప్ర‌కారం.. ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి రాజ‌స్థాన్ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని మార్చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హ‌ఠాత్తుగా ఇక్క‌డి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌కు ప్ర‌జ‌ల క‌ష్టాలు గుర్తుకు వ‌చ్చాయి.

ముఖ్యంగా నారీ మ‌ణుల క‌ష్టాలు ఆయ‌న క‌ళ్ల‌కు క‌నిపించాయి. వెంట‌నే వెనుకా ముందు ఆలోచించ‌కుండా..(ఆయ‌నే చెప్పారు) ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే దాదాపు ఏడాదిన్న‌ర‌గా ఈ సమ‌స్య దేశ‌వ్యాప్తంగా ఉంది.

సో.. ఇదే స‌మ‌స్య రాజ‌స్థాన్‌లోనూ ఉంది. కానీ, ఆయ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తుకు రాలేదు. కానీ, ఎన్నిక‌లకు ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఈ స‌మ‌స్య ఇప్పుడే ఆయ‌న‌కు తెలిసిన‌ట్టుగా స్పందించారు. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నారు. సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఇంత‌కీ.. సీఎం అశోక్ తీసుకున్న నిర్ణ‌యం ఏంటంటే.,. వంట‌గ్యాస్ ధ‌ర‌ల‌ను అమాంతం సగం చేయ‌డ‌మే. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా రూ.1100ల‌కు అటు ఇటుగా వంట గ్యాస్ ధ‌ర‌లు ఉన్నాయి.

బ్యాంకుల్లో రాయితీ ప‌డ‌డం ఆగిపోయి చాన్నాళ్లే అయిపోయింది. సో.. ఈ ధ‌ర‌ల‌తో మ‌హిళ‌ల‌కు మంటెత్తుతోంది. ఇది ఏడాదిన్న‌ర‌గా ఉన్న‌ప్ప‌టికీ.. అశోకుడు మాత్రం ఇప్పుడే గుర్తించిన‌ట్టు వెంట‌నే ఈ ధ‌ర‌ల‌ను 500కు త‌గ్గించేశారు. అయితే.. దీనిని ఆయ‌న వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమ‌లు చేస్తామ‌ని చెప్ప‌డం మ‌రో కొస‌మెరుపు. ఏదేమైనా.. ఎన్నిక‌లు ఉంటే త‌ప్ప‌.. స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల బాధ‌లు నాయ‌కుల‌కు గుర్తుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.