Begin typing your search above and press return to search.

పులిలాంటి కేసీఆర్ ఎంత చవకైపోయారో?

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:22 AM GMT
పులిలాంటి కేసీఆర్ ఎంత చవకైపోయారో?
X
సీమాంద్ర సెటిలర్ల మీదికి ఒంటికాలిమీద లేచి తరిమికొడతానన్నపుడు ఆయన తెలంగాణ జనం దృష్టిలో హీరో. మీడియాను బెదిరించి, నోరెత్తకుండా చేసినప్పుడు ఆయన తనను నమ్మిన జనానికి ఇష్టమైన హిట్లర్. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని - చంద్రబాబు నాయుడిని కూడా అడ్డంగా ఇరికించినప్పుడు ఆయనంటే ప్రత్యర్థులకే కాదు సొంత జనానికి కూడా హడల్. అలాంటి వృద్ద సింహం.. తనపై, తన ప్రభుత్వంపై నోరెత్తితే ఖబడ్డార్ అటూ శివమెత్తిన కేసీఆర్ ఇప్పుడు ఎవరేమన్నా సైలెంటుగా ఉండాల్సిన పరిస్థితిలో చిక్కుకుపోయారా? ఆయన ఎటూ ప్రతివిమర్శలతో విరుచుకు పడలేరు గనుక.. రాజకీయ ప్రత్యర్థులు ఎడ్వాంటేజీ తీసుకుంటున్నారా అనిపిస్తోంది.

గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఈఎస్ ఐ ఆసుపత్రుల నిర్మాణంలో అవకతవకల గురించి ఇటీవల సీబీఐ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినప్పటినుంచి కేసీఆర్ మాట పడిపోయినట్లుంది. ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కే. చంద్రశేఖర రావు ఆ అవకతవకలపై మౌనం వదిలి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని రమణ డిమాండ్ చేశారు.

ప్రధాని ఆహ్వానాన్ని కూడా మన్నించకుండా గతంలో ఢిల్లీ ప్రయాణాన్ని ఎగ్గొట్టిన చరిత్ర కలిగిన కేసీఆర్ ఇప్పుడెందుకు ఢిల్లీకి పరిగెత్తారు? సీబీఐ కేసులోంచి బయటపడేందుకేనా అని టీటీడీపీ అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. ఈ కేసులో తెలంగాణకు చెందిన ఒక యువనేత కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోందని రమణ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలను తెలుసుకునే హక్కు ఉందని, ఎలుగుబంటి సూర్యనారాయణతో కేసీఆర్‌కు ఉన్న సంబంధాన్ని కూడా ఆయనే బయటపెడితే బాగుంటుందని రమణ కోరారు.

పదేళ్ల క్రితం నాటి కేసు తననిలా వెంటాడుతుందని, ఎవరెవరో తనపై విమర్శలు ఎక్కుపెట్టే కాలమొకటి వస్తుందని కేసీఆర్ బహుశా ఊహించి ఉండరు. పులిలాంటి కేసీఆర్‌ నే ఈసారి సీబీఐ పిల్లిని చేసేసిందా అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. నాయకుల్లో ఎవరు ఢిల్లీ వెళ్లినా.. ఎవరు వెళ్లి హోంమంత్రి రాజ్ నాధ్ ను కలిసినా ప్రగతి, లేదా పనుల కోసం అని కాకుండా.. కేసులనుంచి బయటపడడం కోసం అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతున్నదంటే.. రాజకీయాలో ఎంత దిగజారిపోయాయో కదా..!