Begin typing your search above and press return to search.

వాలంటైన్స్ డే..మీరెవ్వ‌రూ కాలేజీకి రావ‌ద్దు

By:  Tupaki Desk   |   13 Feb 2018 2:13 PM GMT
వాలంటైన్స్ డే..మీరెవ్వ‌రూ కాలేజీకి రావ‌ద్దు
X
వాలంటైన్స్ డే సంబ‌రాల‌కు ఓ వైపు విద్యార్థులు సిద్ద‌మ‌వుతుండ‌టం..మ‌రోవైపు ప్రేమికులు క‌నిపిస్తే...పెళ్లి చేసేస్తామ‌ని భ‌జ‌రంగ్ ద‌ళ్ స‌హా ఇత‌ర వేదిక‌లు హెచ్చరిస్తున్న నేప‌థ్యంలో మ‌రోమారు స‌స్పెన్స్ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ లో మ‌రో కీల‌క వార్త‌ తెర‌మీద‌కు వ‌చ్చింది. వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా క్యాంప‌స్‌ కు రావొద్ద‌ని ఏకంగా యూనివ‌ర్సిటీ ఆర్డ‌ర్ వేసింది. లక్నో వర్సిటీ ఈ చిత్ర‌మైన ఆదేశాలు జారీచేసింది.

ఫిబ్రవరి-14 వాలంటైన్స్ డే సందర్భంగా విద్యార్థులు క్యాంపస్‌ లోకి రావొద్దంటూ ల‌క్నో యూనివ‌ర్సిటీ అధికారులు ఆర్డ‌ర్ వేశారు. వాలంటైన్స్ డేతో పాటు మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి-14 వర్సిటీకి సెలవు ప్రకటించామని.. విద్యార్థులెరూ క్లాసుల్లోగానీ - క్యాంపస్ ప్రాంగణంలో కానీ కనిపించొద్దని యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌ లో నోటీసులు అంటించారు. గతంలో కొంతమంది విద్యార్థులు వాలంటైన్స్ డే సమయంలో సంస్కృతి - సంప్రదాయాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని వర్శిటీ అధికారి వినోద్ సింగ్ తెలిపారు. రేపు(బుధవారం-14) ఎలాంటి క్లాస్ లు - సాంస్కృతిక కార్యక్రమాలుకానీ నిర్వహించేది లేదనే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తుంచుకుని..తమకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదిలాఉండ‌గా...వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు)సందర్భంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించొద్దని భజరంగ్‌దళ్ కార్యకర్తలు పబ్బుల యజమానులకు సూచించారు. వాలంటైన్స్ డే నేపథ్యంలో భజరంగ్‌దళ్ సభ్యులు ఇవాళ హైదరాబాద్ నగరంలోని పబ్బులకు వెళ్లారు. వాలంటైన్ డే పేరుతో పబ్బుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టవద్దని కోరుతూ..పబ్బుల యజమానులకు మెమోలు జారీ చేశారు.