Begin typing your search above and press return to search.

అక్కడ బెంట్లీ.. బెంజ్.. ఆడీ కార్లను వదిలేస్తారు

By:  Tupaki Desk   |   9 Jun 2016 5:27 AM GMT
అక్కడ బెంట్లీ.. బెంజ్.. ఆడీ కార్లను వదిలేస్తారు
X
బెంట్లీ.. ల్యాండ్ రోవర్.. బెంజ్.. ఆడీ.. ఈ పేర్ల క్రమం చూస్తే చాలు.. లగ్జరీ పోత పోసినట్లుగా ఉండే కార్లన్న విషయం గుర్తుకు వచ్చేస్తుంది. అలాంటి ఖరీదైన కార్లను ఊరికి చివర.. చెట్ల పొదల్లో వదిలేసి పోవటం ఎవరైనా చేస్తారా? అది కూడా ఒకటో రెండో కాదు.. వందల్లో వదిలేయటం సాధ్యమయ్యే పనా? అంటే లేదంటే లేదని చెబుతారు. కానీ.. చైనాలోని చెంగ్డులో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది.

లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కార్లను ఏదోలా చేసి వాడుకోవటమో లేదంటే.. అమ్మేయటమో లాంటివి చేస్తారు కానీ.. ఊరి చివర వదిలేసి తమకేం పట్టనట్లుగా వెళ్లిపోవటం ప్రపంచంలో మరెక్కడా జరగదేమో? ఇంతకీ.. ఇలా ఎందుకు వదిలేస్తారన్న విషయానికి వస్తే.. ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. ఖరీదైన కార్లను ఇంత పెద్ద ఎత్తున వదిలేయటానికా కారణం.. రిపేర్లు చేయించుకోవటం కష్టంగా మారటం ఒక అంశం అయితే.. సరైన అధికారిక పత్రాలు లేకపోవటం మరో అంశంగా చెబుతుంటారు. దీనికి తోడు స్థానికంగా ఉండే రూల్స్ కూడా ఇలా వదిలేయటానికి కారణంగా చెబుతుంటారు.

ఇలా వదిలేసిన కార్లను స్వాధీనం చేసుకొని వేలం వేసి అమ్మేస్తున్నా.. ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో పేరుకుపోయే కార్లతో అక్కడి అధికారులు తల పట్టుకుంటున్నారట. ఇలా ఊరి చివరన కార్లను వదిలేసి వెళ్లొద్దని చెప్పినా ఎవరూ పట్టించుకోవటం లేదట. ఈ తరహాలో లగ్జరీ కార్లను అలా వదిలేసి వెళ్లటం మరెక్కడా కనిపించదని చెబుతుంటారు. మొత్తానికి చెంగ్డు జనాల తీరు కాస్త భిన్నంగా ఉంది కదూ?