Begin typing your search above and press return to search.

బాబు వ‌ర్సెస్ ఎల్వీ!... ఈఎస్ ఎల్ ఎంట్రీ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   27 April 2019 8:48 AM GMT
బాబు వ‌ర్సెస్ ఎల్వీ!... ఈఎస్ ఎల్ ఎంట్రీ త‌ప్ప‌దా?
X
ఏపీలో ఇప్పుడు వింత ప‌రిస్థితి నెల‌కొంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్పుడు దేశం మొత్తంతో పాటు ఏపీలోనూ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నిక‌లు లేని రాష్ట్రాల్లో ఉన్న ప‌రిస్థితి.... అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన ఏపీలాంటి రాష్ట్రాల్లో లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... అసెంబ్లీ సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉండ‌టంతో ఏపీలో పూర్తి స్థాయిలో ప్ర‌భుత్వం లేన‌ట్లుగానే చెప్పాలి. ఈ లెక్కన చంద్ర‌బాబు స‌ర్కారు... ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం కిందే లెక్క‌. మ‌రి ఎన్నిక‌ల కోడ్ ఇలా నెల‌కు పైగా అమ‌ల్లో ఉంటే... రాష్ట్రంలో పాల‌న సాగేదెలా? ఇదే అంశం... ఇప్పుడు ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కారు వ‌ర్సెస్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా మారిపోయింది. వీరిద్ద‌రి మ‌ధ్య దూరం అంత‌కంత‌కూ పెరిగిపోతుండ‌టంతో గ‌వ‌ర్న‌ర్ జోక్యం త‌ప్ప‌దేమోన‌న్న వాద‌న వినిపిస్తోంది.

ప్ర‌తి చిన్న విష‌యంపైనా స‌మీక్ష‌ల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించే అల‌వాటు ఉన్న చంద్రబాబు... వ‌చ్చే నెల 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేదాకా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవ‌డం దాదాపుగా దుస్సాధ్య‌మే. అలాగ‌ని... ఆయ‌న గ‌తంలో మాదిరిగా పూర్తి స్థాయి యంత్రాంగాన్ని న‌డిపిస్తారా? అంటే... కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌సేమిరా అంటోంది. ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంపై చంద్ర‌బాబు అన‌వ‌స‌రంగా ఘాటు వ్యాఖ్య‌లు చేసి సీఎస్ తో సున్నం పెట్టుకున్న‌ట్టైంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ ప‌క్కాగా అమ‌లు కావాల్సిందేన‌ని సీఎస్ ప‌ట్టుబ‌డుతున్న‌ట్లుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి గోపాల‌కృష్ణ ద్వివేదీ కూడా ఎల్వీ మాట‌కే వెయిటేజీ ఇస్తున్నారు. కోడ్ అమ‌ల్లో ఉంటే... అధికారులే పాల‌న‌ను న‌డిపిస్తార‌న్న కోణంలో ద్వివేదీ, ఎల్వీ... దాదాపుగా ఒక్క‌టైపోయారు.

ఈ త‌ర‌హా ప‌రిస్థితిని గ‌తంలో ఎన్న‌డూ ఎదుర్కోని చంద్ర‌బాబు అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. కేంద్ర‌మే కుట్ర ప‌న్ని ఎన్నిక‌ల సంఘం ద్వారా సీఎస్ గా ఎల్వీని నియ‌మించి త‌న‌పైకి ఉసిగొల్పార‌ని కూడా ఆయ‌న ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో పాల‌న దాదాపుగా ప‌డ‌కేసింద‌నే చెప్పాలి. జిల్లా స్థాయిలో సుప్రీంగా ఉన్న క‌లెక్ట‌ర్లు జిల్లాల వ్యవ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే వారికి రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు గానీ అంద‌డం లేదు. ఈ నేప‌థ్యంలో అప్ప‌టిదాకా కొన‌సాగుతున్న ప‌థ‌కాలు, దైనందిన వ్యవ‌హారాల‌కు మాత్ర‌మే క‌లెక్ట‌ర్లు కూడా ప‌రిమిత‌మ‌వుతున్నారు. తాగునీటి స‌మ‌స్య‌, ఎండ‌ల తీవ్ర‌వ‌, విద్యుత్ అంత‌రాయాలు త‌దిత‌రాల‌పైనా వారు త‌మ పరిధిలో స‌మీక్షించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఈ దిశ‌గా రాష్ట్ర స్థాయిలో ఎలాంటి హ‌డావిడి లేదు. దీంతో రాష్ట్రంలో పాల‌న ప‌డ‌కేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో మూడు రోజుల టూర్ కు చంద్ర‌బాబు సిమ్లాకు బ‌య‌లుదేర‌గా, ఎన్జీటీ విచార‌ణ కోస‌మంటూ సీఎస్ ఎల్వీ రెండు రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఇటు సీఎం చంద్ర‌బాబు గానీ, సీఎస్ ఎల్వీ గానీ అందుబాటులో లేరు. వెర‌సి రాష్ట్రస్థాయిలో నైరాశ్యం రాజ్య‌మూలుతోంది. ఇదే స‌మ‌యంలో తుఫాను ముంచుకొస్తోంది. దీనిపై స‌న్న‌ద్ధ‌త ఏమిట‌న్న‌ది ఎవ‌రికీ ప‌ట్టడం లేదు. ఈ క్ర‌మంలో గ‌ర‌వ్న‌ర్ ఈఎస్ఎస్ న‌ర‌సింహ‌న్ జోక్యం త‌ప్ప‌నిస‌రేన‌న్న వాద‌న వినిపిస్తోంది. సీఎస్ గా ఎల్వీ ఎంట్రీతోనే చంద్ర‌బాబు అగ్గి మీద గుగ్గిల‌మైపోతూ ఉంటే... ఇక గ‌వ‌ర్న‌ర్ జోక్య‌మంటే ఇంకెంత‌గా ఎరుగుతారో చూడాలి.