Begin typing your search above and press return to search.

స్టాలిన్ చొక్కా చించిపారేశారే

By:  Tupaki Desk   |   18 Feb 2017 12:05 PM GMT
స్టాలిన్ చొక్కా చించిపారేశారే
X
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు చోటు చేసుకున్నఈ పరిణామం తమిళనాడు భవిష్యత్ రాజకీయాలకు నాందిగా మారుతుందనటంలో సందేహం లేదు. తమిళనాడు విపక్ష నేత.. డీఎంకే ముఖ్యనేత స్టాలిన్ దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల గురించి.. డీఎంకే చీఫ్ కరుణ కుమారుడు స్టాలిన్ గురించి తెలిసిన వారు ఎవరైనా.. ఆయన ఎలాంటి వాడో.. ఎంతటి శక్తివంతుడన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు భవిష్యత్ ముఖ్యమంత్రిగా చెప్పుకునే స్టాలిన్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

రెండు రోజుల క్రితం పళనిస్వామిని తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్.. ఆయన్ను పదిహేను రోజుల వ్యవధిలో బలనిరూపణ పరీక్షలో పాస్ కావాలని కోరారు. దీనికి తగ్గట్లే ఈ రోజు ప్రత్యేకంగా తమిళనాడు అసెంబ్లీని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సందర్భంగా సభలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవటం.. డీఎంకే నేతలు విరుచుకుపడటం తెలిసిందే.

బలపరీక్ష సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో నానా రచ్చ జరిగిన తర్వాత.. డీఎంకే సభ్యుల్ని హోల్ సేల్ గా సస్పెండ్ చేస్తూ స్పీకర్ ధన్ పాల్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. వారిని సభ నుంచి బయటకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా రహస్య ఓటింగ్ చేపట్టాలని అడిగినా..స్పీకర్ అంగీకరించకపోవటంపై నిరసన వ్యక్తం చేసిన డీఎంకే ఎమ్మెల్యేల్ని భద్రతా సిబ్బంది అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా విపక్ష నేత స్టాలిన్ పట్ల భద్రతా సిబ్బంది బలవంతంగా బయటకు లాగిపారేశారరు. ఈ సందర్భంగా ఆయన గింజుకుంటున్నా.. పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి.. స్టాలిన్ ను ఎత్తుకొని బయటకు ఈడ్చి పారేశారు. ఈ సందర్భంగా ఆయన చొక్కా పూర్తిగా చినిగిపోయింది. ప్రధానప్రతిపక్ష నేత అన్న గౌరవం లేకుండా తన పట్ల దారుణంగా వ్యవహరించారంటూ స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో జరిగిన అంశాలపై తాను గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పిన స్టాలిన్.. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని వెల్లడించారు. సస్పెండ్ అయిన స్టాలిన్ ను బయటకు తీసుకెళ్లే నేపథ్యంలో భద్రతా సిబ్బంది చర్యను పలువురు తప్పు పడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/