Begin typing your search above and press return to search.

ఆ యూనివర్సిటీతో అట్లుంటది.. ఎంఏ పరీక్షలో వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్న!

By:  Tupaki Desk   |   5 Nov 2022 5:32 AM GMT
ఆ యూనివర్సిటీతో అట్లుంటది.. ఎంఏ పరీక్షలో వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్న!
X
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఏ విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష అందరినీ షాక్‌కు గురి చేసింది. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ ప్రశ్నపత్రంలో వైసీపీ ప్రభుత్వంపై అడగడమే ఇందుకు కారణం. సిలబస్‌కు సంబంధం లేకుండా అడిగిన ఈ ప్రశ్నపై అటు విద్యార్థులు, ఇటు వివిధ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఎంఏ పొలిటికల్‌ సైన్సెస్‌ ప్రశ్నపత్రంలో ప్రశ్న 4(బి) కింద వైసీపీ ప్రభుత్వ విధానాల వివరించమని ప్రశ్న ఇచ్చారు. ఇది వైసీపీ పార్టీపై ఒక సానుకూల అభిప్రాయాన్ని విద్యార్థులపై రుద్డడానికి చేసిన ప్రయత్నమని జనసేన పార్టీ నాయకుడు లంకిశెట్టి బాలాజీ విమర్శించారు.

యూనివర్సిటీ పరీక్షల ప్రశ్నపత్రాల్లో రాజకీయ పార్టీపై ప్రశ్నలు వేయడం ఎంత వరకు సమంజసమని బాలాజీ యూనివర్సిటీని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభావంతో యూనివర్శిటీ పని చేస్తోందని, దానికి ఈ ప్రశ్నే పెద్ద ఉదాహరణ అని మండిపడ్డారు.

వైసీపీ ఉంటే ఇష్టమైతే వైసీపీలో చేరాలని.. చదువును రాజకీయం చేస్తూ విద్యార్థుల మనసులను కల్తీ చేయడం సిగ్గుచేటని యూనివర్సిటీ అధికారులపై బాలాజీ మండిపడ్డారు. వైసీపీ పాలనలో యూనివర్సిటీలు రాజకీయాలకు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ఆ ప్రశ్నను పేపర్‌లో చేర్చిన ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ ప్రశ్నపత్రంలో వైసీపీపై ప్రశ్న అడిగిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆంధ్రా యూనివర్సిటీ వీసీ, అధికారులపై వివిధ అంశాలపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్న వ్యవహారం విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ఆందోళనకు కారణమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.