Begin typing your search above and press return to search.

స్మృతి ఇరానీ ని ఇర‌కాటంలో ప‌డేసిన ప్రొఫెస‌ర్‌

By:  Tupaki Desk   |   18 Jan 2017 10:44 AM GMT
స్మృతి ఇరానీ ని ఇర‌కాటంలో ప‌డేసిన ప్రొఫెస‌ర్‌
X
న‌ల్సార్ లా యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌ - కేంద్ర స‌మాచార శాఖ క‌మిష‌న‌ర్ మాడ‌భూషి శ్రీ‌ధ‌ర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ డిగ్రీ విద్యార్హ‌త విష‌యంలో నెల‌కొన్న వివాదంపై స్పందిస్తూ ఆయ‌న డిగ్రీకి సంబంధించిన ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశించి సంచ‌ల‌నం సృష్టించిన‌ సంగ‌తి తెలిసిందే. ఇపుడు అదే రీతిలో కేంద్ర చేనేత - జౌళీ శాఖా మంత్రి స్మృతి ఇరానీ విష‌యంలోనూ మాడ‌భూసి శ్రీ‌ధ‌ర్ అనూహ్యా ఆదేశాలు వెలువ‌రించారు. స్మృతి ఇరానీ విద్యార్హ‌త విష‌యంలో నెల‌కొన్న సందిగ్దం తేలిపోవాలంటే ఆమె విద్యార్హ‌త ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌డ‌మే మార్గ‌మ‌ని పేర్కొంటూ అందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు ఈ మేర‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించారు.

స్మృతి ఇరానీ విష‌యంలో నెల‌కొన్న సందిగ్ద‌త‌ను తేల్చేందుకు ఆమె చదివిన 10, పన్నెండో తరగతి రికార్డులను పరీక్షించేలా అనుమతించాలని ఫిర్యాదుదారు కోర‌గా... వ్యక్తిగత సమాచారం పేరుతో ఆమె వెల్ల‌డించ‌లేదు. దీంతో స‌దరు ద‌ర‌ఖాస్తుదారుడు విన‌తిని కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ మాడ‌భూషి శ్రీ‌ధ‌ర్ విచార‌ణ జ‌రిపి కేంద్ర‌మంత్రి విద్యార్హ‌త‌లు వ్య‌క్తిగ‌త స‌మాచారం కింద‌కు రాద‌ని పేర్కొంటూ స్మృతి చ‌దివిన ప‌ది, పన్నెండో తరగతి రికార్డులను పరీక్షించేందుకు అనుమతించాలని సీబీఎస్ఈని ఆదేశించారు. ఈ నిర్ణ‌యంతో స్మృతి ఇరానీ మళ్ళీ చిక్కుల్లో పడినట్టు అయిన‌ట్లు కనిపిస్తోందని ప‌లువురు అంటున్నారు. ఇదిలాఉండ‌గా...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ డిగ్రీ విద్యార్హ‌త‌ల‌పై నెల‌కొన్న సందేహాల‌ను నివృత్తి చేసుకునేందుకు ఆయ‌న ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించేందుకు అనుమ‌తి ఇచ్చిన త‌ర్వాత మాడ‌భూసి శ్రీ‌ధ‌ర్ విధుల్లో నుంచి మాన‌వ వ‌న‌రుల విభాగం బాధ్య‌త‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తొల‌గించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/