Begin typing your search above and press return to search.

సీపీ స‌జ్జ‌నార్‌ కు మాధ‌వీల‌త ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   10 Feb 2020 2:00 PM GMT
సీపీ స‌జ్జ‌నార్‌ కు మాధ‌వీల‌త ఫిర్యాదు!
X
ఈ మ‌ధ్యకాలంలో సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీలు - సినీ - రాజ‌కీయ ప్ర‌ముఖుల‌పై ట్రోలింగ్స్ కల్చ‌ర్ క‌రోనా వైర‌స్ క‌న్నా ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంది. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయ‌డం....వాటి నుంచి ఇష్టా రీతిన ట్రోల్ చేయ‌డం కొంద‌రు కంత్రీ నెటిజ‌న్ల‌కు ఫ్యాష‌న్ అయిపోయింది. ఇటువంటి ట్రోల్స్‌ ను లైట్ తీసుకోవాల‌ని కొంద‌రు సెల‌బ్రిటీలు భావించినా.....ప‌దే ప‌దే అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించ‌డం....క్యార‌క్ట‌ర్ అసాసినేషన్ ...చేయ‌డంతో వాటిని సీరియ‌స్‌ గా తీసుకోవాల్సిన ప‌రిస్థితి. ఇక కొంద‌రైతే ఆయా సెల‌బ్రిటీల‌తోపాటు వారి కుటుంబ‌స‌భ్యుల‌నూ ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి ట్రోల‌ర్స్‌ కు అడ్డుకట్ట వేసేందుకు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. సంబంధిత ట్రోల‌ర్స్ ఐడీలు - వివ‌రాలు ఇస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ కు బీజేపీ మహిళా నేత - ప్రముఖ సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేశారు.

తనపై వేధింపుల‌కు సంబంధించి స‌జ్జ‌నార్‌కు మాధవీల‌త రెండు ఫిర్యాదులు చేశారు. అందులో ఒకటి తన వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు కాగా, మరొకటి సోషల్ మీడియాలో త‌న‌పై ట్రోలింగ్‌ కు సంబంధించిన‌ది. తన‌ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని, 2 రోజులకోసారి తనను ట్రోల్ చేస్తూ పోస్ట్స్ వస్తున్నాయ‌ని చెప్పారు. సినీ - రాజ‌కీయ రంగంలో ఉన్న తమ క్యారెక్టర్ల గురించి వ్యాఖ్యలు చేయడాన్ని ట్రోల‌ర్స్ త‌మ హక్కుగా భావిస్తున్నార‌ని మాధ‌వీల‌త ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘ఇలా ఎందుకు రాస్తారు?’ అని తిరిగి పోస్ట్ కనుక పెడితే, ‘మీకు మీరు సెలెబ్రిటీస్ అని - లీడర్స్ అని ఫీలవుతున్నారా?’ అంటూ ఈ ట్రోల్స్‌ ను అన్ని సంద‌ర్భాల్లోనూ తేలికగా తీసుకోలేమ‌ని - ఏదో ఒక సందర్భంలో ఆ వ్యాఖ్యలు బాధిస్తాయ‌ని, వాటిపై రియాక్ట్ కాక‌పోవ‌డాన్ని అలుసుగా తీసుకొని మ‌రింత ట్రోల్ చేస్తార‌ని అన్నారు.

అంత‌కుముందు - ప్రముఖ టీవీ యాంకర్ - నటి అనసూయ కూడా సైబర్ క్రైమ్ పోలీసుల‌కు ట్విట్ట‌ర్ ద్వారా ఫిర్యాదు చేశారు.తన ఫొటో మార్ఫింగ్ చేయడంతోపాటు - తన భర్తపై అసభ్యకర ట్వీట్స్ పెట్టారంటూ ట్విట్ట‌ర్‌ లో కంప్ల‌యింట్ ఇచ్చారు. కొందరికి శిక్ష పడితేనే మిగతావాళ్లు ఇలాంటివి చేయడానికి భయపడతారని అన‌సూయ ట్వీట్ చేశారు. మసాలా అనే ట్విట్టర్ ఖాతా నుంచి అన‌సూయ‌ను ట్రోల్ చేశార‌ని - లిఖితపూర్వకంగా అన‌సూయ‌ ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ ఏసీపీ వెల్లడించారు. ఆ అకౌంట్ నుంచి పలువురు హీరోయిన్లు - ప్రముఖ యాంకర్లపై కూడా ప‌లు అస‌భ్య‌క‌ర పోస్టులు చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ట్రోల్స్‌ పై ముందుకు వ‌చ్చి ఫిర్యాదు చేయాల‌ని - అప్పుడే ఇటువంటి ఆక‌తాయిల ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట‌ప‌డుతుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. #Me Too...త‌ర‌హాలో ట్రోల్స్ బారిన ప‌డ్డ ప్ర‌ముఖులంతా క‌లిసి #Trolling ఉద్య‌మం త‌ప్ప‌దేమోన‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.