Begin typing your search above and press return to search.

మాధవీలత గెలుపు ప్రయత్నం..ఆయనపై సెటైర్లు!

By:  Tupaki Desk   |   4 April 2019 7:42 AM GMT
మాధవీలత గెలుపు ప్రయత్నం..ఆయనపై సెటైర్లు!
X
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్న నటి మాధవి లత తన ప్రయత్నాలు తను సాగిస్తూ ఉంది. కమలం పార్టీ తరఫున బరిలో దిగిన ఈ సినీ నటి ఈ ఎన్నికల్లో తన విజయం తథ్యమని అంటోంది. ఒకవేళ తను ఎన్నికల్లో ఓడినా మళ్లీ సినిమాల్లోకి వెళ్లేది లేదని ప్రజా సేవకు తను అంకింతమని ఈ భామ చెబుతూ ఉండటం విశేషం.

సినిమాలకు తీసిపోని రీతిలో మాధవీలత డైలాగులు చెబుతూ ఉంది. ప్రజా సేవ చేయడానికే తను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా మాధవీలత చెబుతూ ఉండటం విశేషం. పదేళ్ల కిందట ఒక సినిమా హిట్ తో గుర్తింపును సంపాదించుకున్న మాధవీలత ఆ తర్వాత కెరీర్ ను అలాగే కొనసాగించలేకపోయింది. వచ్చింది చిన్న సినిమాల్లో అవకాశాలు మాత్రమే. అవి కూడా హిట్ కాకపోయే సరికి దాదాపు తెరమరుగు అయ్యింది.

అలాంటి పరిస్థితుల్లో మాధవీలత ఇటీవల కొన్ని హాట్ కామెంట్స్ తో వార్తల్లోకి వచ్చింది. సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల అంశం గురించి మాధవీలత గళం విప్పింది. తద్వారా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఆమె అదే ఊపును రాజకీయాల మీదకు మళ్లించే ప్రయత్నం చేసింది.

బీజేపీలో చేరి..టక్కున ఎమ్మెల్యే టికెట్ కూడా సంపాదించేసింది. ఎలాగూ బీజేపీ టికెట్లకు పెద్ద పోటీ లేకపోవడంతో మాధవీలతకు అవకాశం లభించినట్టుగా ఉంది.

ఇక ఎన్నికల ప్రచారంలో మాధవీలత టీడీపీ నేత జలీల్ ఖాన్ మీద సెటైర్లు వేస్తోంది. తన చదువు గురించి చెప్పుకొస్తూ.. తను బీకామ్ లో ఫిజిక్స్ చదవలేదని మాధవీలత వ్యంగ్యంగా చెబుతోంది. ప్రజా సేవకు తగినంత చదువు తను చదవినిట్టుగా ఈ నటీమణి చెప్పుకురావడం విశేషం!