Begin typing your search above and press return to search.

దేశ చరిత్రలో తొలిసారి ప్రైవేటు మహిళకు అత్యంత కీలక పదవి

By:  Tupaki Desk   |   1 March 2022 4:23 AM GMT
దేశ చరిత్రలో తొలిసారి ప్రైవేటు మహిళకు అత్యంత కీలక పదవి
X
అనూహ్య నిర్ణయాలకు.. సంచలనాలకు తెర తీసేలా నిర్ణయాలు తీసుకోవటంలో మోడీ సర్కారు ముందుంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. దాదాపు 3.3 ట్రిలియన్ డాలర్ల విలువైన స్టాక్ మార్కెట్ కు అధిపతిగా 56 ఏళ్లను నియమిస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో ఒక మహిళకు ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన ప్రభుత్వంగా మోడీ సర్కారు నిలుస్తుంది. స్టాక్ మార్కెట్ పర్యావరణ వ్యవస్థను పర్యవేక్షించే రెగ్యులేటర్ ఇన్‌ఛార్జ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సింఫుల్ గా చెప్పాలంటే ‘సెబీ’కి ఛైర్ పర్సన్ గా మాధవి పూరి బుచ్ ను ఎంపిక చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

సెబీకి ప్రస్తుతం ఛైర్మన్ గా అజయ్ త్యాగి వ్యవహరిస్తున్నారు. సోమవారంతో (ఫిబ్రవరి 28)తో ఆయన పదవీకాలం ముగిసింది. ఐదేళ్ల పాటు ఛైర్మన్ గా వ్యవహరించిన ఆయన.. తాజాగా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సరికొత్త ఛైర్మన్ ను నియమించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతను పని చేసే ఒక కమిటీ ద్వారా తాజా నియామకాన్ని పూర్తి చేశారు. సెక్యూరిటీస్ మార్కెట్ వాచ్ డాగ్ కు ఎంపికైన తొలి మహిళగా మాధవిని చెప్పాలి. మరో విశేషం ఏమంటే.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే.. ప్రైవేటు రంగం నుంచి ప్రభుత్వ రంగానికి వచ్చిన మహిళగా ఆమెను చెప్పాలి. అంతేకాదు.. ఈ హాట్ సీట్ లో కూర్చుంటున్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఆమె కావటం గమనార్హం.

ఐఐఎం-అహ్మదాబాద్ పూర్వ విద్యార్థిని అయిన మాధవి నియామకం మార్కెట్ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. రానున్న మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఐసీసీఐ బ్యాంకులో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె.. దాదాపు రెండు దశాబ్దాలు (20 ఏళ్లు) సదరు బ్యాంకులో పని చేశారు. వివిధ బాధ్యతల్నిచేపట్టిన ఆమె.. 2009 ఫిబ్రవరి నుంచి 2011 వరకు ఐసీసీఐ సెక్యూరిటీస్ ఎండీగానూ.. సీఈవోగానూ బాద్యతల్ని నిర్వర్తించారు.

2011లో పీఈ కంపెనీలు గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్ఎల్పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు. తదుపరి బ్రిక్స్ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ లో కన్సల్టెంట్ గా సేవలు అందిచారు. ఇదే కాకుండా అగోరా అడ్వయిజరీ ప్రైవేటు లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా ఆమెనే. సెబీకి ఐదేళ్ల పూర్తి కాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబరుతో ముగిసింది. అనంతరం సెబీ సెకండరీ మార్కెట్ కమిటీ అధినేత్రిగా ఎంపికయ్యారు. సెబీకి సేవలు అందించారు. తాజాగా సెబీకి పూర్తిస్థాయి ఛైర్ పర్సన్ గా ఆమె ఎంపికై.. చరిత్రను క్రియేట్ చేశారు.

అనంతరం ఆమె సెబీలో హోల్ టైం మెంబర్ గా పని చేశారు. తాజాగా రిటైర్ అయిన అజయ్ త్యాగి పదవీ కాలం ఇంతకు ముందే ముగియాల్సి ఉంది. అయితే.. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తొలుత ఆయన పదవీకాలాన్ని ఆర్నెల్ల పాటు.. ఆ తర్వాత పద్దెనిమిది నెలల పాటు పొడిగించారు. 2021 అక్టోబరులో సెబీ ఛైర్మన్ పదవికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానించారు. అనంతరం వివిధ దశల్లో వడబోతలు నిర్వహించి.. ఇంటర్వ్యూ అనంతరం మాధవిని ఛైర్ పర్సన్ గా ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సెబీ ఛైర్ పర్సన్ గా ఎంపికైన మాధవికి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు ఆమెను కీరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆమెకు సంబంధించిన మరో ఆసక్తికర అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. 2008 నవంబరు 26న ముంబయిలోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టుల దాడి జిరగినప్పుడు అందులో చిక్కుకుపోయిన కార్పొరేట్ లీడర్లలో ఒకరు మాధవి.